ప్రధాని కావాలనుకోవడం నేరమా? సోనియా గాంధీకి ప్రణబ్ కూతురి ప్రశ్న
ABN , Publish Date - Nov 10 , 2026 | 04:06 PM
ప్రధాని కావాలన్న చిరకాల కోరిక ప్రణబ్ ముఖర్జీకి ఉందని తనకు అనిపించిందంటూ సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రణబ్ కూతురు శర్మిష్ఠా ముఖర్జీ తాజాగా స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: దివంగత నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రధాని కావాలని అనుకున్నట్టు తనకు అనిపించిందని కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ తన ఆత్మకథలో ప్రస్తావించిన వైనం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై ప్రణబ్ కూతురు శర్మిష్ఠా ముఖర్జీ తాజాగా స్పందించారు. ప్రణబ్ లక్ష్యంపై ఆశ్చర్యపోవాల్సిన పనేమిటని ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె పోస్టు పెట్టారు. ప్రధాని పదవికి కావాల్సిన రాజకీయ, పరిపాలన అనుభవం తన తండ్రికి ఉందన్నారు. అద్భుతమైన మేధో శక్తి, కష్టించి పనిచేసే గుణం ఉందని చెప్పారు. ప్రధాని కావాలనుకున్నారా? అని తానూ తండ్రిని గతంలో అడిగానని చెప్పారు. సత్తా ఉన్నా రాజకీయనాయకుడు ఎవరైనా ప్రధాని కావాలని కోరుకుంటారని ప్రణబ్ బదులిచ్చారని గుర్తు చేసుకున్నారు.
‘ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏముంది? ఉన్నత లక్ష్యాలు ఉండటం నేరమా? రాజకీయాల్లో, పరిపాలనలో దశాబ్దాల అనుభవం, కష్టపడి పనిచేసే నైజం, మేధోశక్తి ఉన్నప్పుడు ఇందులో తప్పేముంది?’ అని శర్మిష్ఠ ప్రశ్నించారు. ‘నా తండ్రి సాధారణ నేపథ్యం నుంచి వచ్చారు. కఠోర శ్రమ, మేధో శక్తి ఆధారంగా జీవితంలో పైకెదిగారు. ఎవరూ ఆయనకు ఉన్నతస్థానాలను చెతికందివ్వలేదు’ అని అన్నారు. ‘అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి ప్రధాని కావాలనుకోవడంలో తప్పేముంది? గాంధీ నెహ్రూ కుటుంబానికి చెందని ఓ వ్యక్తి ప్రధాని కావాలనుకోవడమే కాకుండా తనకు సంకేతాలు ఇచ్చేందుకు సాహసించడంపై సోనియా షాకయ్యారా?’ అని ప్రశ్నించారు.
2010లో ప్రణబ్‌తో సంభాషణ గురించి ఎంపీ సోనియా గాంధీ తన ఆత్మకథ బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్‌లో పేర్కొన్నారు. అప్పటి ఆర్థికమంత్రి చిదంబరంతో పొసగని వైనంపై ప్రణబ్ తనతో చెప్పారని అన్నారు. పైస్థాయిలో మార్పునకు సమయం వచ్చిందని ప్రణబ్ వ్యాఖ్యానించారని చెప్పారు. దీంతో, తాను ఒకింత షాకయ్యానని చెప్పారు. ప్రధాని కావాలనే చిరకాల కోరికకు ఆయన వ్యాఖ్యలను సంకేతాంగా భావించానని కూడా సోనియా గాంధీ తెలిపారు. ఆ తరువాత తాను చర్చను మరోవైపునకు మళ్లించానని కూడా చెప్పారు. అయితే, 2012లో యూపీఏ కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీని కాంగ్రెస్ ప్రకటించింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించి భారత 13వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు.
ఈ వార్తలనూ చదవండి:
ఐఏఎస్ అధికారికి టీవీకే ఎమ్మెల్యే అసభ్యకర సందేశాలు పంపారు.. కనిమొళి ఆరోపణ
భారత్ నా ఇల్లు.. వదిలి వెళ్లలేకపోయా: సోనియా గాంధీ