Share News

న్యూఢిల్లీ పేరుతో చైనా వ్లాగర్ల ఫేక్ వీడియోలు

ABN , Publish Date - Nov 10 , 2026 | 06:17 PM

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని మురికివాడలను న్యూఢిల్లీగా చూపిస్తూ చైనా వ్లాగర్లు వీడియోలు రూపొందిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రచారం వెనుక సుమారు 150 మంది ఉన్నట్లు సమాచారం.

న్యూఢిల్లీ పేరుతో చైనా వ్లాగర్ల ఫేక్ వీడియోలు
China Vloggers Fake Videos

ఆంధ్రజ్యోతి, నవంబర్ 10: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని అత్యంత పేదరిక, అధ్వానమైన మురికివాడల ప్రాంతాలను భారత్‌లోని 'న్యూఢిల్లీ'గా చిత్రీకరిస్తూ చైనీస్ వ్లాగర్లు అంతర్జాతీయంగా దుష్ప్రచారం చేస్తున్నారనే సంచలన విషయాలు అధికారిక వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చాయి. భారత్ ప్రతిష్టను, పారిశుధ్య ప్రమాణాలను దిగజార్చే లక్ష్యంతో ఈ ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్ సాగుతోందని వెల్లడైంది.

ఢాకా లొకేషన్లతో ఫేక్ డ్రామాలు

చైనా వ్లాగర్లు ఢాకాలోని మురికివాడలు, కాలువల పక్కన ఉన్న అధ్వానపు ప్రాంతాల్లో వీడియోలు, లైవ్‌స్ట్రీమ్‌లను రికార్డ్ చేస్తున్నారు. ఆ లొకేషన్లను ప్రత్యక్ష ప్రసారం చేస్తూ, 'ఇది న్యూఢిల్లీ.. ఇక్కడ జీవన ప్రమాణాలు, పారిశుధ్యం చాలా అధ్వానంగా ఉన్నాయి' అంటూ ఫేక్ వీడియోలతో ప్రచారం చేస్తున్నారు.

150 మందితో పక్కా నెట్‌వర్క్

దాదాపు 150 మంది చైనా పౌరులు విదేశీ గ్రూపులుగా ఏర్పడి రోజంతా ప్రత్యక్ష ప్రసారాలు (Livestreaming) చేస్తున్నారు. గత 6 నెలలుగా పక్కా ప్రణాళికతో ఢాకా వేదికగా ఈ ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్ కొనసాగుతోంది. స్థానిక బంగ్లాదేశీయులకు రోజుకు 700 నుంచి 800 టాకాలు (Taka) ఇస్తూ తమ ఫేక్ ప్రచారం కోసం వాడుకుంటున్నారు.

చైనీస్ యాప్‌ల ద్వారా వ్యాప్తి

చైనాకు చెందిన 'డౌయిన్' (Douyin), 'వీచాట్' (WeChat) వంటి ప్రముఖ యాప్‌ల ద్వారా ఈ అసత్య కంటెంట్‌ను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేస్తున్నారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని మురికివాడలను నేరుగా భారత్‌గా చూపుతూ చైనా కంటెంట్ క్రియేటర్లు ఈ కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నారు.

ఆహార అలవాట్లు, సంస్కృతిపై బురదజల్లే యత్నం

భారతీయ ఆహార అలవాట్లు, సంస్కృతిపై చైనా వ్లాగర్లు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. (China Vloggers Fake Videos)


ఇవీ చదవండి:

మమతకు ఢిల్లీ పోలీసుల నోటీసులు.. 2013 ఘటనపై వాంగ్మూలం కోరిన పోలీసులు

హెగ్సెత్‌కు ట్రంప్ మద్దతు.. అభిశంసన ప్రయత్నాల వేళ కీలక వ్యాఖ్యలు

Updated Date - Nov 10 , 2026 | 06:36 PM