మిడిల్‌ఈస్ట్‌లో హింసకు స్వస్తి పలకండి: ఇరాన్ అధ్యక్షుడు మసౌద్‌తో మోదీ
ABN , Publish Date - Mar 13 , 2026 | 01:16 PM
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. యుద్ధాన్ని ఆపివేసి శాంతియుతంగా చర్చించుకోవాలని మోదీ సూచించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఫోన్ చేశారు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ తీవ్రత పెరగడం, యుద్ధంలో సామాన్య ప్రజలు, పౌరుల ఆస్తులు ధ్వంసం కావడంపై మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఉద్రిక్తతల నడుమ ఇరువైపులా ఎవరూ వెనక్కి తగ్గని నేపథ్యంలో పరిస్థితులు విపరీత పరిణామాల వైపు దారితీస్తుండటంపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించారాయన.
'ఇరాన్ ప్రెసిడెంట్ డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్‌తో ప్రాంతీయ పరిస్థితులపై చర్చించాను. అక్కడ ఉద్రిక్తతలు పెరగడం, పౌరుల ప్రాణనష్టం అలాగే పౌర మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లడంపై ఆందోళన చెందాను. భారతీయ పౌరుల భద్రత, వస్తువులు, నిరంతర ఇంధన సరఫరా వంటివి భారత్ ప్రాధాన్య అంశాలుగా ఉన్నాయి. అంతేకాకుండా.. శాంతి, స్థిరత్వానికి దేశం నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, సమస్యల పరిష్కారం కోసం చర్చలు, దౌత్యపరమైన జోక్యం అవసరమన్నాను' అని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు.
కాగా.. ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం నేటికి 14వ రోజుకు చేరుకుంది. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు యుద్ధానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో పది రోజుల వ్యవధిలో మోదీ ఆయా పశ్చిమాసియా దేశాల నేతలతో సంభాషించారు. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులు ప్రారంభమైన వేళ ఇరాన్ ప్రధాని పెజెష్కియాన్‌తో తొలిసారి మాట్లాడారు మోదీ.
ఇవీ చదవండి:
'మీరు శాంతిని కోరుకుంటే.. కూర్చుని మాట్లాడుకుంటే చాలు'
రష్యా చమురు కొనుగోలుకు అమెరికా గ్రీన్ సిగ్నల్