Share News

రష్యా చమురు కొనుగోలుకు అమెరికా గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - Mar 13 , 2026 | 08:18 AM

రష్యా చమురు కొనుగోలుకు అమెరికా స్వల్పకాలికంగా అనుమతించింది. సముద్రంలో నిలిచిపోయిన చమురును కొనుగోలు చేసేందుకు ఏప్రిల్ 11 వరకు అవకాశమిచ్చింది.

రష్యా చమురు కొనుగోలుకు అమెరికా గ్రీన్ సిగ్నల్
America Russia oil deal

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌ - ఇజ్రాయెల్, అమెరికాల ఉద్రిక్తతల నేపథ్యంలో తీవ్ర ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్న వేళ ప్రపంచ దేశాలకు కాస్త ఉపశమనం లభించింది. రష్యా చమురు కొనుగోలుకు స్వల్పకాలికంగా అనుమతినిస్తూ అమెరికా ఉత్తర్వులు జారీ చేసింది. సముద్రంలో నిలిచిపోయిన చమురును కొనుగోలు చేసేందుకు ఏప్రిల్ 11 వరకు అవకాశం కల్పించింది.


ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్లో నెలకొన్న అనిశ్చితిని తొలగించేందుకు అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్న తరణంలో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌లో స్థిరత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్టు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. 'ప్రపంచ ఇంధన మార్కెట్‌లో స్థిరత్వాన్ని పెంపొందించడం, ధరలను అదుపులో ఉంచేందుకే ట్రంప్ ఈ నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతానికి సముద్రంలో నిలిచిపోయిన చమురు రవాణాకు మాత్రమే ఈ అనుమతులు వర్తిస్తాయి' అని బెసెంట్ స్పష్టం చేశారు.


రష్యాపై ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ అమెరికా తాత్కాలిక సడలింపులతో పుతిన్ ప్రభుత్వానికి పెద్దగా ఆర్థిక ప్రయోజనం ఉండదని బెసెంట్ అన్నారు. రష్యాకు వచ్చే ఆదాయంలో అధిక భాగం చమురు వెలికితీసే సమయంలోనే పన్నుల రూపంలో అందుతుందని, ఇప్పుడు రవాణాలో ఉన్న చమురు అమ్మకం వల్ల వారికి అదనపు ప్రయోజనమేమీ ఉండదని ఆయన వివరించారు. ఈ నిర్ణయం వల్ల స్వల్పకాలికంగా ధరలు పెరిగినా.. దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇది ఎంతో మేలుచేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే.. తాజా సడలింపులతో మార్చి 12 నాటికి నౌకల్లో లోడ్ అయిన రష్యా ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులను ఏప్రిల్ 11 వరకు విక్రయించుకోవచ్చు. గతంలో అమెరికా ఆంక్షలు విధించిన రష్యన్ సంస్థల నుంచి ఉత్పత్తైన చమురును కూడా ఇప్పుడు కొనుగోలు చేసుకోవచ్చు.


ఇవీ చదవండి:

హోర్ముజ్ జలసంధిలో భారత నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్

హోర్ముజ్ జలసంధిని మూసే ఉంచుతాం: మొజ్తాబా

Updated Date - Mar 13 , 2026 | 08:28 AM