Share News

హోర్ముజ్ జలసంధిని మూసే ఉంచుతాం, దాడులు కొనసాగిస్తాం.. మొజ్తాబా తొలి ప్రకటన

ABN , Publish Date - Mar 12 , 2026 | 08:39 PM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన వేళ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ సంచలన ప్రకటన విడుదల చేశారు. హోర్ముజ్ జలసంధిని మూసే ఉంచుతామని అన్నారు.

హోర్ముజ్ జలసంధిని మూసే ఉంచుతాం, దాడులు కొనసాగిస్తాం.. మొజ్తాబా తొలి ప్రకటన
Mojtaba Khamenei

టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన వేళ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) సంచలన ప్రకటన విడుదల చేశారు. హోర్ముజ్ జలసంధిని మూసే ఉంచుతామని అన్నారు. హోర్ముజ్ జలసంధి మూసివేతను తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా అమెరికా-ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచే చర్యగా అభివర్ణించారు. ఆయన ప్రకటనను ఇరాన్ టెలివిజన్ ప్రసారం చేసింది. మొజ్తాబా మాత్రం కెమెరా ముందుకు రాలేదు. ఇరాన్ సుప్రీం నేతగా ఎన్నికైన తర్వాత ఆయన అధికారిక ప్రకటన విడుదల చేయడం ఇదే మొదటిసారి.


దాడులు కొనసాగిస్తాం..

మధ్యప్రాచ్యంలో శత్రులక్ష్యాలపై దాడులు కొనసాగిస్తామని కూడా మొజ్తాబా హెచ్చరించారు. అమెరికా స్థావరాలను మూసివేయాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు. లేనిపక్షంలో దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ప్రజలు చిందించిన రక్తం.. ముఖ్యంగా మినాబ్‌లో పాఠశాలపై జరిగిన బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలకు ప్రతీకారం తీర్చుకునే విషయంలో వెనుకంజ వేసేది లేదన్నారు.


పరిహారం చెల్లించాలి

యుద్ధంలో శత్రువులు కలిగించిన నష్టానికి ఇరాన్ పరిహారం కోరుతోందని మొజ్తాబా అన్నారు. పరిహారం చెల్లించని పక్షంలో అంతే మొత్తాన్ని వాళ్ల ఆస్తుల నుంచి తీసుకుంటుందని, అది సాధ్యం కాకుంటే అంతే మొత్తంలో ఆస్తులకు నష్టం కలిగిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత కష్టకాలంలో దేశంలోని ప్రజలు, సంస్థలు కలిసికట్టుగా ఉండాలని, అమెరికా చెబుతున్న అబద్ధాలను తిప్పికొట్టాలని, జాతీయ సమైక్యతను చాటుకోవాలని కోరారు.


ఇవి కూడా చదవండి..

ఒక్క లీటర్ ఆయిల్‌ను కూడా హోర్ముజ్ నుంచి వెళ్లనివ్వం: ఇరాన్

హోర్ముజ్ జలసంధిలో భారత నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్

Updated Date - Mar 12 , 2026 | 09:42 PM