పెజెష్కియాన్ కీలక ప్రకటన.. యుద్ధం ఆపాలంటే షరతులకు ఒప్పుకోవాల్సిందే..
ABN , Publish Date - Mar 12 , 2026 | 11:36 AM
పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక ప్రకటన చేశారు. యుద్ధానికి ముగింపు పలకాలంటే తమ షరతులకు అంగీకరించాల్సిందేనని తేల్చి చెప్పారు.
టెహ్రాన్, మార్చి 12: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం 13వ రోజుకు చేరుకుంది. ఇజ్రాయెల్, అమెరికా దేశాలు సంయుక్తంగా ఇరాన్‌పై మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 1300 మంది ఇరానీయులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కు తగ్గటం లేదు. రెండు దేశాలపై విరుచుకుపడుతోంది. అరబ్ దేశాలలోని అమెరికా ఎయిర్‌బేస్‌లపై దాడులు చేస్తోంది. యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయిల్, గ్యాస్ ఎరువుల కొరత తీవ్రంగా వేధిస్తోంది.
ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక ప్రకటన చేశారు. యుద్ధానికి ముగింపు పలకాలంటే తమ షరతులకు అంగీకరించాల్సిందేనని తేల్చి చెప్పారు. భవిష్యత్‌లోనూ తమ దేశంపై ఎవరూ దాడులు చేయకూడదని అన్నారు. తమ న్యాయపర హక్కులను ప్రపంచం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. పశ్చిమాసియాలో శాంతి, భద్రతలకు ఇరాన్ కట్టుబడి ఉందన్నారు. అయితే, ఇరాన్ భద్రతకు గ్యారెంటీ ఇస్తేనే యుద్ధం ఆపుతామని చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌తో ఫోన్‌లో మాట్లాడినపుడు కూడా ఇదే విషయం చెప్పామని అన్నారు.
మెజ్తాబాకు ట్రంప్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అమెరికా డిమాండ్లకు ఒప్పుకోవాలని ట్రంప్ స్పష్టం చేశారు. న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్‌ను ఇరాన్ పూర్తిగా ఆపేయాలన్నారు. అలా జరగని పక్షంలో చావు తప్పదని హెచ్చరించారు. ఫిబ్రవరి 28వ తేదీ లాంటి దాడులు మరోసారి జరుగుతాయని చెప్పారు. ఇజ్రాయెల్ సాయంతో మొజ్తాబాను చంపేస్తామని తేల్చి చెప్పారు.
ఇవి కూడా చదవండి
మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. భారీ భద్రత మధ్య సమావేశాలు
జగన్ హయాంలో పెట్టుబడిదారులను వేధించారు.. సీఎం చంద్రబాబు ధ్వజం