Share News

ఒకే కారులో ప్రయాణించిన మోదీ-మెక్రాన్

ABN , Publish Date - Feb 17 , 2026 | 09:18 PM

భారత్‌లో పర్యటిస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్‌‌తో స్నేహబంధాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాటుకున్నారు. ఒకే కారులో ఇరువురూ కలిసి ప్రయాణించారు.

ఒకే కారులో ప్రయాణించిన మోదీ-మెక్రాన్
Macron and PM Modi

ముంబై: భారత్‌లో పర్యటిస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్‌ (Emmanuel Macron)తో స్నేహబంధాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చాటుకున్నారు. ఒకే కారులో ఇరువురూ కలిసి ప్రయాణించారు. ముంబైలో ద్వైపాక్షిక, ప్రతినిధుల స్థాయి చర్చల్లో ఉభయనేతలు మంగళవారంనాడు పాల్గొన్నారు. మీడియా సంయుక్త సమావేశానంతరం ఇరువురూ ఒకే కారులో ఇండియా-ఫ్రాన్స్ ఇన్నొవేషన్ ఫోరమ్ వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మోదీ పోస్ట్ చేశారు.


'ముంబైలోని లోక్‌భవన్‌లో చర్చలు, మీడియా సమావేశం అనంతరం అధ్యక్షుడు మెక్రాన్‌తో కలిసి ఇండో-ఫ్రాన్స్ ఇన్నొవేషన్ ఫోరంలో పాల్గొనేందుకు కలిసి బయలుదేరాం' అని ఆ పోస్ట్‌లో మోదీ పేర్కొన్నారు. ఇన్నొవేషన్, ట్రేడ్, టెక్నాలజీ తదితర రంగాల్లో సహకారం పెంపుపై ఇరుదేశాలు దృష్టి సారించిన నేపథ్యంలో అగ్రనేతలిద్దరి మధ్య సాన్నిహిత్యం ప్రాధాన్యం సంతరించుకుంది.


గ్లోబల్ నేతలతో కలిసి కారులో మోదీ ప్రయాణించడం ఇదే మొదటిసారి కాదు. ఈనెల మొదట్లో మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో కలిసి కౌలాలంపూర్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు కారులో ప్రయాణించారు. గత ఏడాది డిసెంబర్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా పర్యటనకు వచ్చినప్పుడు ప్రొటోకాల్‌ను మోదీ పక్కనపెట్టి విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఒకే కారులో లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసానికి ఇరువురూ కలిసి ప్రయాణించారు. గత నెలలో భారత్‌లో అధికార పర్యటకు వచ్చిన జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌తో గుజరాత్‌లో కలిసి కారులో ప్రయాణించారు. గత జనవరిలో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ భారత్ పర్యటనకు వచ్చినప్పుడు ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు మోదీ స్వాగతం పలికారు. అనంతరం ఒకే కారులో కలిసి ప్రయాణించారు.


ఇవి కూడా చదవండి..

ఫ్రాన్స్ సహకారంతో ఎవరెస్ట్ హైట్స్‌కు వెళ్లే హెలికాప్టర్ల తయారీ.. మోదీ

మెక్రాన్‌తో ముంబైలో మోదీ భేటీ

Updated Date - Feb 17 , 2026 | 09:42 PM