కేరళలో ఎల్‌డీఎఫ్‌కు ఉద్వాసన, బీజేపీ విజయం ఖాయం: మోదీ
ABN , Publish Date - Apr 04 , 2026 | 07:16 PM
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ అధికారంలోకి వస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎల్డీఎఫ్ ఉద్వాసనకు కౌంట్‌డౌన్ మొదలైందని చెప్పారు.
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (NDA) అధికారంలోకి వస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. ఎల్డీఎఫ్ (LDF) ఉద్వాసనకు కౌంట్‌డౌన్ మొదలైందని చెప్పారు. తిరువళ్ల మున్సిపాలిటీలో శనివారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ, కేరళ అభివృద్ధిపై కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి ఎన్నడూ దృష్టి పెట్టలేదని, 2004-2014 మధ్య కేరళ అభివృద్ధికి అప్పటి కేంద్రలోని యూపీఏ ప్రభుత్వం కేటాయించిన మొత్తం కంటే తమ ప్రభుత్వం ఎక్కువ కేటాయించిందని చెప్పారు. జనాభా నియంత్రణతో దక్షిణాది రాష్ట్రాలు లోక్‌సభ స్థానాలు కోల్పోతాయంటూ చేస్తున్న వాదనల్లో కూడా నిజం లేదని స్పష్టం చేశారు.
'ఇంతకుముందు కూడా ఇక్కడకు వచ్చాను. కానీ ఈసారి అన్నివైపుల నుంచి మార్పు కోరుతున్న బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. కేరళలో అతిపెద్ద మార్పు రాబోతోంది. తొలిసారి బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వం కేరళలో అధికారంలోకి రాబోతోంది' అని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఎల్డీఎఫ్-యూడీఎఫ్ ప్రభుత్వాలు ఎప్పుడూ ఈ ప్రాంతం గురించి పట్టించుకోలేదని, రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, చాలా ఏళ్లుగా ఒక్క ప్రధాన బ్రిడ్జి కూడా నిర్మించ లేదని, మెడికల్ కాలేజీ పరిస్థితి దయనీయంగా ఉందని విమర్శించారు. కనీస మౌలిక సదుపాయాలు లేకుండా జీవన ప్రమాణాలు ఏ స్థాయిలో ఉంటాయనేది ఎవరైనా ఊహించవచ్చని అన్నారు.
మోదీ గ్యారెంటీ..
ఎన్డీయే విధానాలతో ప్రతి ఒక్క వర్గానికి, ముఖ్యంగా మహిళలు ఎంతో లబ్ధి పొందుతున్నారని ప్రధాని అన్నారు. వలస కార్మికులకు ఉద్యోగాలు కల్పన కేరళలో అతిపెద్ద సమస్యగా ఉందని, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సమస్యలను పరిష్కరిస్తామని, ఇది మోదీ ఇచ్చే హామీ అని ప్రధాని భరోసా ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాలు, గోవా తరహాలోనే కేరళను అభివృద్ధి చేస్తామని అన్నారు. సబరి రైల్వే ప్రాజెక్టు నిలిచిపోవడానికి ఎల్‌డీఎఫ్ కారణమని విమర్శించారు. బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని అడ్డంకులూ తొలగిపోతాయని భరోసా ఇచ్చారు. కాగా, కేరళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 9న ఒకే విడతలో జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై
ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు