ప్రపంచానికి పరిష్కారాల కేంద్రంగా భారత్: ప్రధాని మోదీ
ABN , Publish Date - Jun 14 , 2026 | 04:41 PM
ప్రపంచానికి పరిష్కారాలు అందించే శక్తిగా భారత్ ఎదుగుతోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్‌లో నిర్వహించిన భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. దేశంలో కొనసాగుతున్న స్టార్టప్ విప్లవం, యువత ఆవిష్కరణలే ఈ మార్పునకు ప్రధాన కారణమన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో ఆదివారం నిర్వహించిన భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ప్రపంచానికి పరిష్కారాల కేంద్రంగా భారత్ ఎదుగుతోందని వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దంలో భారత్ వేగంగా పురోగతి సాధిస్తోందని, దేశంలో స్టార్టప్ విప్లవం కొనసాగుతోందన్నారు. యువత సరికొత్త ఆలోచనలతో మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు కనుగొనే దిశగా కృషి చేస్తోందన్నారు. ఆ ఆవిష్కరణలను ప్రపంచ వేదికపై నిలబెట్టడమే ఈ కార్యక్రమం లక్ష్యమని మోదీ చెప్పుకొచ్చారు.
'నేటి యువ పారిశ్రామికవేత్తలు భారత భవిష్యత్తుకు ప్రతీక. వారి ఆత్మవిశ్వాసం, సృజనాత్మక శక్తి నవ భారతానికి అద్దం పడుతున్నాయి. గ్రామీణ జీవితాన్ని కృత్రిమ మేధ ద్వారా మార్చేలా అనేక స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి' అని మోదీ తెలిపారు. భారత్, ఫ్రాన్స్ సంబంధాలు వ్యూహాత్మక ప్రయోజనాలకు మాత్రమే పరిమితం కాదన్న మోదీ.. ఉమ్మడి దృక్పథం, విలువలు, ఆవిష్కరణలు, ప్రేరణలపై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ సౌర కూటమి, కృత్రిమ మేధ రంగం, భద్రత, సుస్థిరాభివృద్ధి వంటి అంశాల్లో ఇరు దేశాలు కలిసి ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలు వెతుకుతున్నాయన్నారు.
ఇదే వేదికపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ మాట్లాడుతూ.. ప్రపంచ ఆవిష్కరణల రంగంలో భారత్ కీలక శక్తిగా ఎదుగుతోందని ప్రశంసించారు. 140 కోట్ల జనాభాతో కూడిన భారత్.. విద్య, పరిశోధన, సాంకేతిక శిక్షణ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోందన్నారు. ఏటా 10 లక్షల మందికి పైగా ఇంజినీర్లను తయారుచేస్తూ ప్రపంచ సాంకేతిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. అంతరిక్ష రంగంలోనూ భారత్ సాధించిన విజయాలు.. ఆ దేశ సామర్థ్యానికి నిదర్శనమన్నారు. ఫ్రాన్స్‌లో తొలిసారిగా భారత్ వెలుపల 'భారత్ ఇన్నోవేట్స్' కార్యక్రమం నిర్వహించడం గౌరవంగా ఉందని మెక్రాన్ వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి:
AIADMKకి సినీ నటి గౌతమి రాజీనామా
అన్‌స్టాపబుల్‌గా అమరావతి నిర్మాణం.. మంత్రి లోకేశ్ వీడియో పోస్ట్