'హెల్తీ' పేర్లపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడా.. ఆ 8 బ్రాండ్లకు నోటీసులు
ABN , Publish Date - Jun 14 , 2026 | 04:05 PM
దేశంలో ఆహార ఉత్పత్తులపై తప్పుదారి పట్టించే ప్రకటనలు, బ్రాండ్ పేర్ల వినియోగంపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడా ఝుళిపించింది. వినియోగదారులను తప్పుదారి పట్టించేలా అనుమానమున్న పలు ప్రముఖ బ్రాండ్లకు నోటీసులు జారీ చేసింది. ఇంతకీ ఆ బ్రాండ్లు ఏవి? ఆ వివరాలేమిటో ఓసారి పరిశీలిస్తే...
ఇంటర్నెట్ డెస్క్: నెస్లే ఇండియా సంస్థకు చెందిన మ్యాగీ న్యూడుల్స్‌లో పురుగులు ఉన్నాయంటూ ఇటీవల విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ(FSSAI) అప్రమత్తమై నెస్లేను వివరణ కోరడం సహా.. ఆహార ఉత్పత్తులపై వినియోగదారులను తప్పుదారి పట్టించేలా ఉన్న వాణిజ్య, బ్రాండ్ పేర్లు, ఆరోగ్య సంబంధిత ప్రకటనలపై చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో తాజాగా.. 8 ఆహార, వ్యాపార సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు ఎక్స్ మీడియా వేదికగా వెల్లడించింది.
ఎమామి హెల్తీ అండ్ టేస్టీ, హెల్త్ ఎయిడ్, ట్రూవీ, ది హెల్తీ ఫ్యాక్టరీ, హెల్తీ మాస్టర్, హెల్తీ ఛాయిస్, ప్లాన్ బీ, న్యూహెర్బ్స్‌లకు సదరు నోటీసులు పంపినట్టు ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. ఎమామీ హెల్తీ, ట్రూ విటమిన్, వీగన్ వంటి పేర్లతో వినియోగదారుల్లో ఉత్పత్తులపై ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాల భావన కలిగిస్తున్నారనే ఆరోపణలతో ఈ చర్యలకు ఉపక్రమించినట్టు స్పష్టం చేసింది. సదరు సంస్థలు ఆహార భద్రతా ప్రమాణాల చట్టం-2006 నిబంధనలను ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపింది.
ఇటీవల మార్కెట్లోకి వచ్చిన పలు ఆహార ఉత్పత్తులు, బ్రాండ్లు, ప్రచార వాదనలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఎమామి గ్రూప్‌నకు చెందిన హెల్తీ అండ్ టేస్టీ వంట నూనెల బ్రాండ్ పేరు, ప్లాన్ బీ సంస్థ వీగన్ అనుమతులు లేకుండానే చేస్తున్న ప్రచారం, ది హెల్తీ ఫ్యాక్టరీ జీరో మైదా ఉత్పత్తుల వాదనలు, న్యూ హెర్బ్స్ విక్రయిస్తున్న ట్రూ విటమిన్‌లపై అనుమానాలు లేవనెత్తింది. అలాగే ట్రూవీ, హెల్తీ మాస్టర్, హెల్తీ ఛాయిస్, హెల్త్ ఎయిడ్ వంటి సంస్థలు ఉపయోగిస్తున్న హెల్తీ పేరుతో కూడిన బ్రాండ్ పేర్లు, ట్యాగ్‌లైన్లు వినియోగదారులను తప్పుదారి పట్టించే అవకాశముందని పేర్కొంది. ఈ పేర్లు, వాదనలు, ప్రచార విధానాలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయనే అంశంపై పరిశీలిస్తున్నట్టు స్పష్టం చేసింది.
కాగా.. ఇటీవలే సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నెస్లే ఇండియా(మ్యాగీ), కేఎఫ్‌సీ, ఫ్లిప్‌కార్ట్, ఓపెన్ సీక్రెట్ సంస్థలకూ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులకు సరైన సమాచారం అందేలా చూడటం, తప్పుడు లేదా బూటకపు ఆరోగ్య వాదనలను అరికట్టడం తమ ప్రధాన లక్ష్యమని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది.
ఇవీ చదవండి:
AIADMKకి సినీ నటి గౌతమి రాజీనామా
అన్‌స్టాపబుల్‌గా అమరావతి నిర్మాణం.. మంత్రి లోకేశ్ వీడియో పోస్ట్