సీబీఎస్ఈ 'త్రిభాషా' విధానంపై సుప్రీంకోర్టులో పిటిషన్..!
ABN , Publish Date - May 22 , 2026 | 12:27 PM
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) తొమ్మిదో తరగతి విద్యార్థులకు మూడు భాషల బోధనను తప్పనిసరి చేస్తూ తీసుకువచ్చిన నూతన విద్యా విధానం ఇప్పుడు న్యాయ వివాదానికి దారితీసింది. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
ఢిల్లీ, మే 22: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) తొమ్మిదో తరగతి విద్యార్థులకు మూడు భాషల బోధనను తప్పనిసరి చేస్తూ తీసుకువచ్చిన నూతన విద్యా విధానం ఇప్పుడు న్యాయ వివాదానికి దారితీసింది. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల తరఫున దాఖలైన ఈ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.
ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ప్రస్తావించారు. విద్యా సంవత్సరం మధ్యలో అకస్మాత్తుగా తొమ్మిదో తరగతి నుంచి మూడు భాషలను తప్పనిసరి చేయడం వల్ల విద్యార్థులపై తీవ్రమైన మానసిక, విద్యాపరమైన భారం పడుతుందని రోహత్గి కోర్టుకు వివరించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న విద్యా విధానానికి ఇది పూర్తిగా భిన్నంగా ఉందని, దీనివల్ల అటు విద్యార్థుల్లో, ఇటు విద్యాసంస్థల్లో తీవ్ర గందరగోళం నెలకొందని ఆయన పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై త్వరితగతిన విచారణ జరపాలని ఆయన ధర్మాసనాన్ని అభ్యర్థించారు.
జాతీయ విద్యా విధానం (NEP) సిఫార్సుల మేరకు సీబీఎస్ఈ విద్యా చట్రంలో మార్పులు చేస్తూ,9, 10 తరగతుల్లో విద్యార్థులు కచ్చితంగా మూడు భాషలను (అందులో రెండు భారతీయ భాషలు అయి ఉండాలి) చదవాలనే నిబంధనను తీసుకువచ్చింది. అయితే, తగిన ముందస్తు ప్రణాళిక లేకుండా, కోర్సుల మధ్యలో ఈ నిబంధనను రుద్దడం సమంజసం కాదని పిటిషనర్లు వాదిస్తున్నారు. ఈ వాదనలను పరిశీలించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం, ఈ పిటిషన్‌పై వచ్చే వారం సమగ్ర విచారణ జరిపేందుకు అంగీకారం తెలిపింది. ఈ విచారణపై దేశవ్యాప్తంగా ఉన్న సీబీఎస్ఈ పాఠశాలలు, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి:
కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి లోకేశ్ కౌంటర్
For More National News And Telugu News