సీఎం భార్య పాస్‌పోర్ట్ వివాదం.. పవన్ ఖేడాకు ముందస్తు బెయిలు
ABN , Publish Date - Apr 10 , 2026 | 03:02 PM
కాంగ్రెస్ నేత పవన్ ఖేడా (Pawan Khera)కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు కోర్టు వారం రోజుల పాటు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రిణికి భూయాన్ శర్మకు మూడు పాస్‌పోర్టులు ఉన్నాయంటూ ఖేడా చేసిన ఆరోపణలు వివాదాస్పదమయ్యాయి.
హైదరాబాద్: కాంగ్రెస్ నేత పవన్ ఖేడా (Pawan Khera)కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు కోర్టు వారం రోజుల పాటు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రిణికి భూయాన్ శర్మకు మూడు పాస్‌పోర్టులు ఉన్నాయంటూ ఖేడా చేసిన ఆరోపణలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై రిణికి భూయాన్ కేసు నమోదు చేయడంతో ముందస్తు బెయిలు కోసం ఖేడా తెలంగాణ హైకోర్టును ఆయన ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ కె.సుజన వారం రోజుల ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ, గడువులోగా సంబంధింత కోర్టును ఖేడా ఆశ్రయించాలని పేర్కొన్నారు.
భూయాన్‌కు మూడు దేశాల పాస్‌పోర్టులు, విదేశాల్లో లెక్కల్లో చూపని ఆస్తులు ఉన్నాయని ఖేడా ఇటీవల ఆరోపించారు. ఈ వివరాలను సీఎం తన అఫిడవిట్‌లో దాచిపెట్టారని అన్నారు. ఈ ఆరోపణలను భూయాన్ ఖండించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఢిల్లీలోని ఖేడా నివాసానికి ఇటీవల అసోం పోలీసు బృందం వెళ్లింది. అయితే ఆ సమయంలో ఖేడా తన నివాసంలో లేకపోవడంతో వెనుదిరిగింది.
కాగా, ఖేడా తరఫున కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి హైకోర్టులో తన వాదనలు వినిపిస్తూ, అస్సాం ప్రభుత్వం రాజకీయ కక్షతోనే కేసు పెట్టందని అన్నారు. అయితే అలాంటిదేమీ లేదని అస్సాం అడ్వకేట్ జనరల్ దేవజిత్ సైకియా కోర్టుకు తెలిపారు. ఖేడా పిటిషన్ తెలంగాణ హైకోర్టు పరిధిలోకి రాదని, కానీ ఆయన తన నివాస చిరునామా హైదరాబాద్ చూపించారని పేర్కొన్నారు. అస్సాంలో ఖేడా ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని, ముఖ్యమంత్రి భార్యపై ఆయన చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. దీంతో సంబంధిత కోర్టులో ఖేడా పిటిషన్ వేసేందుకు హైకోర్టు వారం రోజులు సమయం ఇచ్చింది.
ఇవి కూడా చదవండి..
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ
మహిళా రిజర్వేషన్లపై బీజేపీ ‘మాస్టర్ ప్లాన్’.. పార్లమెంటు బిల్లుకు ముందే దేశవ్యాప్త ప్రచారం!