ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఉగ్రదాడి
ABN , Publish Date - Apr 21 , 2026 | 08:32 AM
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగి సరిగ్గా రేపటికి ఏడాది అవుతుంది. మొత్తం 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటన దేశంలో తీవ్ర ఆగ్రవేశాలను రేకెత్తించిన విషయం తెలిసిందే..
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగి సరిగ్గా రేపటికి (బుధవారం) ఏడాది అవుతుంది. మొత్తం 26 మందిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా ఆగ్రహావేశాలతో అట్టుడికిిన సంగతి తెలిసిందే. జమ్మూ కశ్మీర్ అందాలు వీక్షించేందుకు వెళ్లిన పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. తేరుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ కాల్పుల్లో మొత్తం 25 మంది పర్యాటకులు, ఒక స్థానికుడు మరణించారు.
ఉగ్రదాడిపై మోదీ సర్కార్ ఆగ్రహం..
ఈ ఉగ్రదాడిపై మోదీ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యగా భావించింది. అదే సమయంలో ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ‘లష్కరే ఈ తోయిబా’ అనుబంధ సంస్థ ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్ఎఫ్) స్వయంగా ప్రకటించింది. ఈ దారుణానికి కర్మ, కర్త, క్రియా అంతా పాకిస్థాన్ అని స్పష్టమైంది.
అలా ఆపరేషన్ సిందూర్..
ఉగ్రదాడితో మోదీ సర్కార్ తెరపైకి ‘ఆపరేషన్ సింధూర్’ తీసుకొచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు చేసింది. ఈ దాడిలో దాదాపు 100 మందిపైగా ఉగ్రవాదులు మరణించారు. అలాగే ఉగ్రవాద స్థావరాలను సైతం నేలమట్టం చేసింది. ఈ ఘటనలో లష్కరే ఈ తోయిబా సంస్థ అధినేత హఫీజ్ ముహమ్మద్ సయీద్ సమీప బంధువులు కూడా మరణించారు.
పాక్‌పై తీవ్ర చర్యలు..
ఈ చర్యల్లో భాగంగా భారత్ నుంచి పాకిస్థాన్‌కు వెళ్లే సింధూ జలాలను నిలిపి వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అందుకోసం కొన్ని దశాబ్దాల క్రితం చేసుకున్న ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. పాకిస్థాన్ నుంచి వచ్చే వస్తువులపై నిషేధం విధించింది. ఇరు దేశాల మధ్య అటారీ - వాఘా సరిహద్దును మూసేసింది. భారత్‌లో పాక్ నౌకల ప్రవేశాన్ని నిలిపివేసింది. పాకిస్థాన్ కళాకారులపై సైతం నిషేధం విధించింది. భారత్ గగనతలంలో ఎగరకుండా పాక్ విమానాలను కట్టడి చేసింది.
ఇరు దేశాల మధ్య పెరిగిన దూరం..
ఇక పాకిస్థాన్ సైతం అదే రీతిలో స్పందించింది. ఇరుదేశాల్లో రాయబారులను స్వదేశానికి వెళ్లిపోవాలంటూ ఆయా దేశాల ప్రభుత్వాలు ఆదేశించాయి. ఈ పెహల్గాం ఉగ్రదాడి అనంతరం ఈ రెండు దేశాల మధ్య దూరం బాగా పెరిగింది. పెహల్గాంలో ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను గతేడాది జులైలో భద్రతా బలగాలు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు ప్రభుత్వం అప్పగించింది.
పాక్ చర్యలను ప్రపంచానికి వివరించిన కేంద్రం..
మరోవైపు ఈ ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్థాన్ చర్యలు ప్రపంచానికి వివరించాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సంకల్పించింది. అందుకోసం పలు పార్లమెంట్ సభ్యులతో కూడిన బృందాలను ఏర్పాటు చేసింది. ఆ బృందాలను వివిధ దేశాలకు పంపించి.. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ తీరును ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు వివరించింది. ఈ దారుణం జరిగి ఏడాది గడుస్తున్నా.. ఈ ఘటన కారణంగా తమ కుటుంబాల్లో కలవరం మాత్రం నేటికీ అలానే ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For More National News And Telugu News