స్టాలిన్ పీఠం పదిలమా?
ABN , Publish Date - Apr 21 , 2026 | 03:20 AM
డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తన సీఎం పీఠాన్ని నిలబెట్టుకుంటారా..? సంప్రదాయాన్ని బద్దలుకొట్టి వరుసగా రెండోసారి పార్టీని అధికారంలోకి తీసుకురాగలరా..
‘డీలిమిటేషన్’ వ్యతిరేక హీరోగా ఆయనకు అదనపు మైలేజ్!
(చెన్నై-ఆంధ్రజ్యోతి)
డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తన సీఎం పీఠాన్ని నిలబెట్టుకుంటారా..? సంప్రదాయాన్ని బద్దలుకొట్టి వరుసగా రెండోసారి పార్టీని అధికారంలోకి తీసుకురాగలరా..? తమిళనాట డీఎంకే కూటమి, అన్నాడీఎంకే కూటమి, సినీనటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. నిజానికి 16 పార్టీలతో కూడిన డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ కూటమి బలీయంగా వుంది. 164 స్థానాల్లో బరిలోకి దిగిన డీఎంకే.. మిగిలిన స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. ఈ కూటమిలోని కాంగ్రెస్ 28 సీట్లలో పోటీ చేస్తోంది. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. మహిళలకు, విద్యార్థినులకు నగదు పంపిణీ, ఉచిత బస్సు ప్రయాణం, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహార పంపిణీ, తమిళ మాధ్యమంలో చదివే విద్యార్థులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం వంటివి ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. అదే సమయంలో కేంద్రం తమిళనాడు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, మరీ ముఖ్యంగా విద్యా నిధులు భారీగా కోతపెట్టిందని స్టాలిన్ చేస్తున్న విమర్శలు ప్రజల్లోకి బాగానే వెళ్లాయని డీఎంకే వర్గాలు అంటున్నాయి. ఇటీవలి వరకు గవర్నర్‌గా పనిచేసిన ఆర్‌ఎన్ రవి ద్వారా ఉద్దేశపూర్వకంగా డీఎంకే ప్రభుత్వాన్ని కేంద్రం ఇరుకునబెట్టిందన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. దీనివల్లే కేంద్రం ఆయన్ను ఎన్నికలకు ముందు రాష్ట్రం నుంచి బదిలీచేసిందని అంటున్నారు. అన్నిటికీ మించి అన్నాడీఎంకే బలాబలాలు బాగా తెలిసిన మాజీ సీఎం పన్నీర్‌సెల్వం ఇటీవల డీఎంకేలో చేరడం డీఎంకే కూటమికి ఎంతోకొంత మేలు చేసే అంశమే. క్రైస్తవుల ఓట్లలో అత్యధికం టీవీకేకు పోలయ్యే సూచనలున్నా.. ముస్లిం ఓట్లు మాత్రం గంపగుత్తగా తమకే పడతాయని డీఎంకే వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. కెప్టెన్ విజయకాంత్ స్థాపించిన డీఎండీకే కొత్తగా కూటమిలో చేరడం, కూటమి పార్టీల ఐక్యత ప్రధాన బలంగా కనిపిస్తోంది. స్టాలిన్ అన్నీ తానై కూటమిని నడిపిస్తున్నారు.
‘డీలిమిటేషన్’ గొడవతో డీఎంకేకు లబ్ధి!
డీలిమిటేషన్ విధానాన్ని ఆది నుంచీ వ్యతిరేకిస్తున్న స్టాలిన్.. ఇటీవల పార్లమెంటులో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వ్యవహారంలో క్రియాశీలంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తమిళనాడును తీవ్రంగా నష్టపరిచే ఈ బిల్లును అడ్డుకున్న హీరోగా స్టాలిన్‌కు రాష్ట్రవ్యాప్తంగా మైలేజ్ వచ్చిందని.. మహిళా బిల్లును అడ్డుకున్నారంటూ బీజేపీ, అన్నాడీఎంకే చేస్తున్న విమర్శల ప్రభావం పెద్దగా కనిపించడం లేదని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. అయితే, 77 ఏళ్ల డీఎంకే చరిత్రలో ఇప్పటి వరకూ ఆ పార్టీ వరుసగా రెండోసారి అధికారమెక్కిన దాఖలాలు లేవు. కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడు నూతన సచివాలయ నిర్మాణం, ఇబ్బడిముబ్బడిగా వంతెనల ఏర్పాటు, అభివృద్ధి, సంక్షేమ పథకాలతో విశేష ప్రజాదరణ పొందినట్లు కనిపించినా ఆయన కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. అప్పట్లో జయలలిత ప్రత్యర్థిగా ఉన్నారు.