క్రీడల్లో మతాన్ని తీసుకురావద్దు.. ఇమ్రాన్‌కు తోటి ఎంపీ రంజన్ సూచన
ABN , Publish Date - Nov 21 , 2026 | 03:23 PM
న్యూజిల్యాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను పక్కన పెట్టడంపై మతపరమైన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎంపీఇమ్రాన్ మసూద్‌కు సొంత పార్టీ నుంచే బౌన్సర్ ఎదురైంది. క్రీడల్లో జోక్యం చేసుకోరాదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రంజీత్ రంజన్ సూచించారు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిల్యాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను పక్కన పెట్టడంపై మతపరమైన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎంపీఇమ్రాన్ మసూద్‌కు సొంత పార్టీ నుంచే బౌన్సర్ ఎదురైంది. క్రీడల్లో జోక్యం చేసుకోరాదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రంజీత్ రంజన్ సూచించారు. క్రీడల్లోకి మతాన్ని తీసుకురావద్దని ఆమె హెచ్చరించారు. శనివారం ఓ వార్తా సంస్థతో రంజన్ మాట్లాడారు. క్రీడల్లోకి మతాన్ని తీసుకురావడం సరికాదన్నారు. ‘మసూద్‌జీ.. క్రీడలు, రాజకీయాలను పక్కన పెట్టండి. స్పోర్ట్స్‌లో జోక్యం చేసుకోవద్దు. ఎందుకంటే క్రీడలకు వాటి సొంత డొమైన్, క్రైటీరియా ఉన్నాయి. ప్రతి ప్లేయర్ కూడా జట్టులోకి రావడానికి, దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఎంతో కష్టపడుతున్నారు. క్రీడలను, క్రీడాకారులను రాజకీయ చర్చల్లోకి లాగరాదు. అలా చేయడం ఆమోదయోగ్యం కాదు’ అని రంజన్ వ్యాఖ్యానించారు.
వెనక్కి తగ్గని మసూద్
తన వ్యాఖ్యలపై ప్రత్యర్థి నేతలతో పాటు సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నా ఇమ్రాన్ మసూద్ వెనక్కి తగ్గడం లేదు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నా తన వ్యాఖ్యలకే కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ‘సిరాజ్‌తో పాటు మొహమ్మద్ షమీ, సర్ఫరాజ్ ఖాన్, ఇంకా చాలా మంది ఉన్నారు. జట్టు ఎంపిక ఆటగాడి ప్రదర్శన ఆధారంగా ఉండాలి. ఒకరు రాణిస్తున్న కాలం అతను ఎక్కడి నుంచి వచ్చాడు అన్నది చూడకూడదు’ అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.
మజ్లిస్ లీడర్ వారిస్ మద్దతు
మజ్లిస్ లీడర్ వారిస్ పఠాన్ కూడా సిరాజ్‌కు మద్దతుగా గళమెత్తారు. శనివారం ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు. జట్టు ఎంపిక ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. ఆటగాడి ట్యాలెంట్, ప్రదర్శన ఆధారంగా కాకుండా అతని పేరుపై జట్టును ఎంపిక చేస్తున్నారా అని నిలదీశారు. గతంలో సర్ఫరాజ్, షమీకీ అలాగే జరిగిందన్నారు. ‘టీంకు అవసరమైన ప్రతీసారి సిరాజ్ గొప్ప ప్రదర్శన చేశాడు. ఇప్పుడు కూడా అతను బాగా ఆడుతున్నాడు. మరి ఎందుకు అతడిని బెంచ్‌కే పరిమితం చేశారు?’ అని పఠాన్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
వీళ్లు సచిన్‌ను కూడా పక్కన పెడతారు.. టీమిండియా మేనేజ్మెంట్పై కైఫ్ విమర్శలు..
రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలుకొట్టిన పడిక్కల్..