ఆసక్తికరంగా కొలత్తూరు ఉపఎన్నిక.. ఎంకే స్టాలిన్ మళ్లీ పోటీ చేస్తారా..?
ABN , Publish Date - Nov 21 , 2026 | 11:01 AM
తమిళనాడు రాజకీయాల్లో కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక హీట్ పెంచుతోంది. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు మరణంతో ఈ స్థానం ఖాళీ అవ్వగా ఎన్నికల సంఘం ఉపఎన్నిక నిర్వహించనుంది. అయితే, ఈ ఎన్నికలో మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మళ్లీ పోటీ చేస్తారా, లేదా? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
చెన్నై, నవంబర్ 21: తమిళనాడు రాజకీయాల్లో కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తమిళగ వెట్రి కళగం (TVK) ఎమ్మెల్యే వీఎస్ బాబు మరణంతో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయింది. దీంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యం కానుంది. అయితే, ఈ ఎన్నికలో మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మళ్లీ పోటీ చేస్తారా, లేదా? అన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీనిపై తమిళనాడు వ్యాప్తంగా తీవ్రమైన చర్చ మొదలైంది.
2021 నుంచి కొలత్తూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎంకే స్టాలిన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, 2026 అసెంబ్లీ ఎన్నికలు ఆయనకు షాక్ ఇచ్చాయి. స్టాలిన్‌పై టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా.. స్టాలిన్‌కు 74,202 ఓట్లు వచ్చాయి. దీంతో బాబు 8,795 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఫలితంతో 2011 నుంచి కొలత్తూరులో కొనసాగిన స్టాలిన్ విజయపరంపరకు తెరపడింది. అంతేకాకుండా, రాష్ట్రంలో డీఎంకే అధికారాన్ని కోల్పోవడం కూడా పార్టీకి మరో పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అయితే, జెయింట్ కిల్లర్‌గా గుర్తింపు పొందిన వీఎస్ బాబు ఈనెల 19న అనారోగ్య సమస్యలతో మరణించారు. దీంతో కొలత్తూరు నియోజకవర్గానికి ఎన్నికల సంఘం ఉపఎన్నిక నిర్వహించనుంది.
ఈ ఉపఎన్నికలో కొలత్తూరు నుంచి స్టాలిన్ మళ్లీ పోటీ చేయాలని డీఎంకే నేతలు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. దీనిపై డీఎంకే ఎంపీ సి. రవీంద్రన్ స్పందిస్తూ.. కొలత్తూరు అంటేనే స్టాలిన్ నియోజకవర్గమని, ఆయన మళ్లీ పోటీ చేయాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారని తెలిపారు. అయితే, పోటీ చేయాలా, వద్దా? అనే నిర్ణయం మాత్రం పూర్తిగా స్టాలిన్‌దేనని స్పష్టం చేశారు. మరోవైపు, ఈ ఉపఎన్నిక డీఎంకే, టీవీకే పార్టీలకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ స్థానాన్ని తిరిగి గెలుచుకోవడం ద్వారా తన బలాన్ని నిరూపించుకోవాలని డీఎంకే భావిస్తోంది. అలాగే, ఈ స్థానాన్ని మళ్లీ గెలుచుకుని తమ ఆధిక్యాన్ని ప్రదర్శించాలని విజయ్ నేతృత్వంలోని టీవీకే కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొలత్తూరు ఉపఎన్నిక రాజకీయంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
మణిపూర్‌లో కల్తీ మద్యం కలకలం.. 12 మంది మృతి, 180 మందికి అస్వస్థత
గోప్రో కెమెరాపై చైనా మౌనం.. ఎన్ఐఏ ప్రశ్నలకు స్పందించని డ్రాగన్ దేశ అధికారులు