Share News

బాబా ఆశారం బాపునకు సుప్రీంలో దక్కని ఊరట

ABN , Publish Date - Jun 30 , 2026 | 12:24 PM

2013లో ఓ బాలికపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న స్వయంప్రకటిత ఆధ్యాత్మిక గురువు బాబా ఆశారం బాపునకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

బాబా ఆశారం బాపునకు సుప్రీంలో దక్కని ఊరట
Supreme Court

ఢిల్లీ, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): 2013లో ఓ బాలికపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న స్వయంప్రకటిత ఆధ్యాత్మిక గురువు బాబా ఆశారం బాపునకు (Asharam Bapu) సుప్రీంకోర్టులో (Supreme Court) తాత్కాలికంగా ఊరట లభించలేదు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది.


తనపై విధించిన జీవిత ఖైదును సమర్థిస్తూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆశారాం బాపు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ (M. M. Sundresh) నేతృత్వంలోని ధర్మాసనం రాజస్థాన్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆశారాం పిటిషన్‌పై రెండు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం స్పందించే వరకు ఆశారాంకు ఎలాంటి బెయిల్ మంజూరు చేయబోమని స్పష్టం చేసింది.


విచారణ సందర్భంగా ఆశారాం తరఫు న్యాయవాదులు వైద్య కారణాలను ప్రస్తావిస్తూ బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. అయితే ప్రస్తుతం అలాంటి తక్షణ ఉపశమనానికి అవకాశం లేదని ధర్మాసనం తెలిపింది. ప్రాణాలకు ముప్పు కలిగించేంత తీవ్రమైన అత్యవసర పరిస్థితి (Grave Necessity) ఉన్న సందర్భాల్లో మాత్రమే బెయిల్ అంశాన్ని పరిశీలించగలమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. రాజస్థాన్ ప్రభుత్వం సమర్పించే కౌంటర్‌ను పరిశీలించిన తర్వాతే బెయిల్‌పై తదుపరి నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది.


కాగా, 2013లో రాజస్థాన్‌లో ఓ మైనర్‌పై అత్యాచారం చేసిన కేసులో ఆశారాం బాపు దోషిగా తేలారు. అనంతరం న్యాయస్థానం ఆయనకు జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం ఆశారాం జోధ్‌పూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో ఆయన న్యాయపరమైన పోరాటం కొనసాగుతున్నప్పటికీ, తక్షణ ఉపశమనం మాత్రం లభించలేదు. ఇప్పుడు రాజస్థాన్ ప్రభుత్వం సమర్పించే అఫిడవిట్, తదుపరి విచారణలో కోర్టు అభిప్రాయం కీలకంగా మారనున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతుల సంస్కృతికి ప్రతీక: మంత్రి పొన్నం ప్రభాకర్

డూప్లికేట్ ఓట్లతోనే రేవంత్‌రెడ్డి గెలిచారని మా అనుమానం: కవిత

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 30 , 2026 | 12:48 PM