Share News

Nitin Nabin Sinha: బీజేపీ నూతన అధ్యక్షుడిగా నితిన్‌ నబీన్‌ ఏకగ్రీవం.. అతి పిన్న వయస్కుడిగా రికార్డు

ABN , Publish Date - Jan 20 , 2026 | 01:10 PM

భారతీయ జనతా పార్టీ జాతీయ ఆధ్యక్ష పదవికి నితిన్ నబీన్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు బీజేపీ ప్రకటించింది. 45 ఏళ్ల వయసున్న నితిన్ నబీన్ ఈ పదవి అందుకోవడం ద్వారా పార్టీ చరిత్రలో అతి పిన్న అధ్యక్షుడిగా ఆయన రికార్డు నెలకొల్పారు.

Nitin Nabin Sinha: బీజేపీ నూతన అధ్యక్షుడిగా నితిన్‌ నబీన్‌ ఏకగ్రీవం.. అతి పిన్న వయస్కుడిగా రికార్డు
BJP new president,

న్యూఢిల్లీ, జనవరి 20: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జాతీయ అధ్యక్షుడిగా బిహార్ నేత నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 45 ఏళ్ల వయసులో ఈ పదవిని స్వీకరించిన ఆయన బీజేపీ చరిత్రలో అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. ఆయన పార్టీకి 12వ జాతీయ అధ్యక్షుడు.

నితిన్ నబీన్ 1980లో జన్మించారు(బీజేపీ స్థాపన సంవత్సరం). బిహార్‌లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. గతంలో బిహార్ మంత్రివర్గంలో పలు శాఖలు నిర్వహించారు. ఇప్పటివరకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న నితిన్‌ నబీన్‌ సిన్హా ఎన్నిక కావడం లాంఛనప్రాయమైంది. 45 ఏళ్ల చరిత్ర గల బీజేపీకి తొలిసారిగా పార్టీ కంటే పిన్న వయస్కుడైన నితిన్‌ నబీన్‌ తొలిసారి అధ్యక్షుడయ్యారు. పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడ్ని ప్రధాని నరేంద్రమోదీ పూలమాలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు.


కాగా.. పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌, పీయూష్‌ గోయల్‌, హర్దీప్‌సింగ్‌ పురి, కిరిణ్‌ రిజుజు తదితరులు.. నితిన్‌ నబీన్‌కు మద్దతుగా నామినేషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పార్టీ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, ఎంపీ డా కె.లక్ష్మణ్‌కు ఈ నామినేషన్‌ పత్రాలను సమర్పించారు.

వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల నేతృత్వంలో పార్టీ ముఖ్య నేతలు నితిన్‌ నబీన్‌కు మద్దతుగా నామినేషన్లను దాఖలు చేయగా మొత్తం 37 సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలయ్యాయి. బరిలో ఒక్కరే ఉండటంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ ఉదయం (మంగళవారం) ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ కౌన్సిల్‌ సభ్యులు, ముఖ్య నేతల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ, రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కె.లక్ష్మణ్‌తో కలిసి బీజేపీ నూతన అధ్యక్షుడి పేరును ప్రకటించారు.


ఉమ్మడి బిహార్‌లోని రాంచీలో పుట్టిన నితిన్‌ నబీన్‌.. తొలుత బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇంటర్మీడియట్‌ చదివిన ఆయన బీజేపీ తరఫున కొన్ని రాష్ట్రాలకు ఇన్‌ఛార్జిగానూ పనిచేశారు. బిహార్‌ బాంకీపూర్‌ నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం ఉంది. బిహార్‌ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదాకు ఎదిగిన తొలి నేత నితిన్‌ నబీన్‌ కావడం మరో విశేషం.


ఈ వార్తలు కూడా చదవండి.

భారీ పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా..

ఏపీలో స్విస్‌ పెట్టుబడులకు సహకరించండి

Read Latest Telangana News and National News

Updated Date - Jan 20 , 2026 | 01:43 PM