Share News

Karnataka DGP: ఆఫీసులో రాసలీలలు.. కర్ణాటక డీజీపీ స్థాయి అధికారి కె.రామచంద్ర రావు సస్పెన్షన్

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:04 PM

కర్ణాటక ప్రభుత్వం డీజీపీ స్థాయి అధికారి కె.రామచంద్ర రావును సస్పెండ్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న కొన్ని వీడియోల్లో రామచంద్ర రావు.. మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తున్నట్టు ఉండటంతో ఈ మేరకు చర్యలు చేపట్టింది.

Karnataka DGP: ఆఫీసులో రాసలీలలు.. కర్ణాటక డీజీపీ స్థాయి అధికారి కె.రామచంద్ర రావు సస్పెన్షన్
Karnataka DGP suspended

బెంగళూరు, జనవరి 20: కర్ణాటక ప్రభుత్వం డీజీపీ(సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్మెంట్)గా సేవలందిస్తున్న కె.రామచంద్ర రావును చివరికి సస్పెండ్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న కొన్ని వీడియోల్లో రామచంద్ర రావు మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తున్నట్టు ఉండటంతో ఈ మేరకు చర్యలు చేపట్టింది. మంగళవారం ఈ సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

రామచంద్ర రావు ప్రభుత్వ ఉద్యోగిగా నిబంధనలు ఉల్లంఘించారని ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇది ప్రభుత్వానికీ ఇబ్బందిగా మారిందని.. ఈ క్రమంలోనే సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. సస్పెన్షన్‌ సమయంలో ప్రభుత్వ అనుమతి లేకుండా రామచంద్ర రావు హెడ్‌క్వార్టర్స్‌ను విడిచి వెళ్లకూడదని కూడా ఆదేశించింది. కాగా.. ఈ ఉదంతం మీద స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. సంబంధిత అధికారిపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సోమవారం ఆదేశించిన సంగతి తెలిసిందే.


ఇలా ఉండగా.. కర్ణాటకలో డీజీపీ స్థాయి అధికారి అయిన కె.రామచంద్ర రావు రాసలీలల వీడియోలు బహిర్గతం కావడం ఆ రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. తన ఆఫీసులోనే, పోలీస్‌ డ్రెస్సుతో యువతులతో ఆ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సరసాలాడటం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ రైట్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(డీసీఆర్‌ఈ) డీజీపీ రామచంద్ర రావు శృంగార చేష్టల వీడియోలు సోమవారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. యూనిఫామ్‌లో ఉన్న ఆయన తన ఛాంబర్‌లోనే యువతులను కౌగిలించుకుంటూ, ముద్దులు పెట్టే దృశ్యాలు ఆ వీడియోల్లో చూసి అంతా అవాక్కయ్యారు.

వివిధ సందర్భాల్లో తీసిన ఆ వీడియోల్లో ఉన్న ముగ్గురు యువతుల్లో ఒకరు మోడల్‌ అని తెలుస్తోంది. డీజీపీ రాసలీలల వీడియోలపై స్థానిక మీడియా ఛానళ్లలో ప్రత్యేక కథనాలు హోరెత్తాయి. వీడియోలు వైరల్‌ అయిన తర్వాత పోలీస్ శాఖలోనూ తీవ్ర చర్చ సాగుతోంది. పోలీసుల పరువు పోయిందని పలువురు మండిపడుతున్నారు. అయితే.. ఆ వీడియోలు మార్ఫింగ్‌ చేసినవని.. రామచంద్ర రావు మీడియాతో చెప్పుకొచ్చారు. ఇది తన పరువుకు భంగం కలిగించేందుకు చేసిన కుట్ర అని ఆయన ఆరోపించారు. ఆ వీడియోలు 8 ఏళ్ల క్రితం నాటివని, ఆ సమయంలో తాను బెళగావిలో ఉన్నానన్నారు.


ఏపీలోని గుంటూరుకు చెందిన రామచంద్ర రావు 1993 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. 2023లో ఆయన డీజీపీగా పదోన్నతి పొందారు. వచ్చే జూన్‌లో ఆయన రిటైర్‌ కానున్నారు. ఆయన పదవీ కాలంలో పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన పెంపుడు కూతురు, సినీనటి రన్యారావ్‌ దుబాయ్‌ నుంచి పలుమార్లు బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చిన విషయం గతంలో దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఎయిర్‌పోర్టు నుంచి రన్యారావ్‌ ఎలాంటి చెకింగ్‌ లేకుండా ప్రొటోకాల్‌ ద్వారా బయటకు వచ్చేందుకు పోలీస్ వాహనాన్ని వినియోగించారు. ఈ కేసును సిట్‌ అధికారులు దర్యాప్తు జరిపారు. ఈ క్రమంలో డీజీపీపై అప్పట్లో సస్పెన్షన్‌ వేటు పడింది.

గతేడాది చివర్లో మరోసారి రామచంద్ర రావుకు పోస్టింగ్‌ ఇచ్చారు. పోలీస్‌ హౌసింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ సీఎండీగా పనిచేసిన సమయంలోనూ ఆయన కేసులు, అంతర్గత విచారణలు ఎదుర్కొన్నారు. దక్షిణ రేంజ్‌ ఐజీపీగా ఉన్నప్పుడు ఓ కేసులో పట్టుబడ్డ డబ్బులో పెద్ద మొత్తం మాయం చేశారనే ఆరోపణలూ రామచంద్ర రావుపై వచ్చాయి.


DGP Suspension Order.jpg


ఈ వార్తలు కూడా చదవండి.

భారీ పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా..

ఏపీలో స్విస్‌ పెట్టుబడులకు సహకరించండి

Read Latest Telangana News and National News

Updated Date - Jan 20 , 2026 | 01:25 PM