సోనియా ఆ విషయాలు కూడా చెబితే బావుండేది: నిషికాంత్ దూబె
ABN , Publish Date - Nov 21 , 2026 | 03:12 PM
1970ల నాటి మారుతి ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబె తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
ఆంధ్రజ్యోతి, నవంబర్ 21: 1970ల నాటి మారుతి ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబె తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. 'కాంగ్రెస్ చీకటి అధ్యాయం' పేరిట సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (X) లో ఆయన కొనసాగిస్తున్న సిరీస్‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
విదేశీ పౌరురాలిగా ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా సోనియా గాంధీ మారుతి కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా వ్యవహరించారని, నాటి ప్రభుత్వ యంత్రాంగం గాంధీ కుటుంబానికి అనుకూలంగా పనిచేసిందని ఆయన ఆరోపించారు.
నిషికాంత్ దూబె తన పోస్ట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, 1970లో సోనియా గాంధీ 'మారుతి టెక్నికల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్' అనే సంస్థను స్థాపించారు. అప్పటి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ విదేశీ పౌరుడూ భారతీయ కంపెనీకి డైరెక్టర్ కాకూడదని, అయినప్పటికీ విదేశీ పౌరురాలైన సోనియా గాంధీ ఆ కంపెనీకి ఎండీగా, 50 శాతం వాటాదారుగా ఉన్నారని దూబె ఆరోపించారు. అదే ఏడాది నవంబర్‌లో సంజయ్ గాంధీ ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన తెలిపారు.
ఈ కంపెనీకి కార్ల తయారీ కోసం 1968లోనే అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కేబినెట్ అనుమతులు మంజూరు చేసిందని నిషికాంత్ దూబె పేర్కొన్నారు. సంస్థ ఏర్పాటులో ప్రధానమంత్రి కార్యాలయ (PMO) అధికారుల ప్రమేయం ఉందని, ఇందిరా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి ఆర్.కె. ధావన్ కూడా ఈ కంపెనీలో డైరెక్టర్‌గా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, 1972 ఏప్రిల్‌లో సంజయ్ గాంధీ ప్రభుత్వ ఖర్చుతో కంపెనీ తరపున విదేశీ పర్యటనలు చేశారని దూబె విమర్శించారు.
భూ కేటాయింపులు, ఆర్థిక లబ్ధి
మారుతి ప్రాజెక్టు కోసం హరియాణాలో ప్రభుత్వం భూమిని కేటాయించిందని, అయితే నాటి హరియాణా నిబంధనల ప్రకారం విదేశీయుల పేరు మీద భూమిని కేటాయించే వీలులేదని దూబె చెప్పుకొచ్చారు. కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించక ముందే, వాహనాల బాడీల నిర్మాణం కోసం మారుతికి ముందస్తు చెల్లింపులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు అందాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఎలాంటి చెల్లింపులు తీసుకోకుండానే మారుతికి సిమెంట్, ఉక్కు, బొగ్గు సరఫరా చేశాయని, అలాగే గాంధీ కుటుంబ సంస్థలకు సులభంగా రుణాలు ఇప్పించడానికే అప్పట్లో బ్యాంకుల జాతీయీకరణ జరిగి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
సోనియా గాంధీకి సవాల్
తాను చేసిన ఆరోపణలు నిజమా కాదా అనే విషయంపై సోనియా గాంధీ స్పష్టత ఇవ్వాలని నిషికాంత్ దూబె డిమాండ్ చేశారు. సొంత పెట్టుబడి లేకుండా ఇంత పెద్ద కంపెనీని ఎలా నిర్మించారో, నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ సంస్థ వృద్ధికి ఏ విధంగా సహకరించారో సోనియా గాంధీ తన పుస్తకంలో వివరించి ఉంటే బాగుండేదని ఆయన తన పోస్ట్ ద్వారా విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
అంతర్జాతీయ ప్రమాణాలతో విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి: ఎంపీ శ్రీభరత్
పులివెందులలో వైసీపీ రాజకీయ డ్రామాలకు కాలం చెల్లింది: బీటెక్ రవి
ఇండియన్ రోడ్ నెట్‌వర్క్ ప్రపంచంలోనే నంబర్‌వన్: నితిన్ గడ్కరీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News