Share News

నా వ్యాఖ్యలను దురుద్దేశంతో వక్రీకరించారు: సీజేఐ సూర్యకాంత్

ABN , Publish Date - Aug 14 , 2026 | 09:35 PM

న్యాయస్థానంలో చేసిన మౌఖిక వ్యాఖ్యలను సందర్భం లేకుండా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు.

నా వ్యాఖ్యలను దురుద్దేశంతో వక్రీకరించారు: సీజేఐ సూర్యకాంత్
CJI Suryakant

ఇంటర్నెట్ డెస్క్: న్యాయస్థానంలో చేసిన మౌఖిక వ్యాఖ్యలను సందర్భం లేకుండా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి, చెప్పని మాటలను కూడా చెప్పినట్లుగా ప్రచారం చేశారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా దేశ యువతను తప్పుదోవ పట్టించేందుకు ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దుష్ప్రచారమని వ్యాఖ్యానించారు.


'కోర్టు విచారణలకు సంబంధించిన చిన్న వీడియో క్లిప్పులను అసందర్భానుసారంగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నా వ్యాఖ్యలను వక్రీకరించారు. నేను చెప్పని విషయాలను కూడా చెప్పినట్లుగా చూపించారు. ఇది చాలా దురదృష్టకరం. ముఖ్యంగా దేశ యువతను తప్పుదోవ పట్టించేందుకు జరుగుతున్న తీవ్రమైన దుష్ప్రచారం' అని సీజేఐ పేర్కొన్నట్లు తెలుస్తోంది. న్యాయస్థాన విచారణలను ప్రసారం చేసేటప్పుడు మీడియా బాధ్యతగా వ్యవహరించాలని ఈ సందర్భంగా సీజేఐ సూచించారు. ప్రతి పౌరుడికీ హక్కులతో పాటు బాధ్యతలు, రాజ్యాంగపరమైన విధులూ ఉన్నాయని గుర్తుచేశారు.


సుప్రీంకోర్టు కార్యకలాపాల్లో పారదర్శకత అవసరమని, అందులో భాగంగానే విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని సీజేఐ తెలిపారు. అయితే.. వీటిని దుర్వినియోగం చేయకూడదని ఆయన స్పష్టం చేశారు. కోర్టు విచారణల ఆడియో, వీడియో రికార్డింగ్‌లను అనధికారికంగా కట్ చేసి.. మళ్లీ ప్రచారం చేయడం, అప్‌లోడ్ చేయడం, వాటి ద్వారా వాణిజ్య ప్రయోజనాలు పొందడాన్ని అడ్డుకునేలా ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 'న్యాయవ్యవస్థలో పారదర్శకతకు మేము కట్టుబడి ఉన్నాం. అయితే చిన్న చిన్న క్లిప్పులను వ్యక్తిగత, వాణిజ్య ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడం ఆగాలి' అని సీజేఐ సూర్యకాంత్ స్పష్టం చేశారు.


కాగా.. మే 15న సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా సీజేఐ చేసిన 'కాక్రోచ్‌' వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. నకిలీ విద్యార్హతలతో వ్యవస్థపై దాడి చేసేందుకు సోషల్‌ మీడియా, ఆర్టీఐ కార్యకర్తలుగా మారే కొందరిని ఉద్దేశించి ఆయన ఆ పదాన్ని ఉపయోగించినట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిపై యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తర్వాత 'కాక్రోచ్‌ జంతా పార్టీ(సీజేపీ)' పేరుతో వ్యంగ్యాత్మకంగా ఓ ఆన్‌లైన్‌ ఉద్యమం ప్రారంభమైంది.


ఇవీ చదవండి:

కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ జాబ్స్.. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

రాహుల్ గాంధీకి ఊరట.. పరువు నష్టం కేసును కొట్టేసిన సుప్రీం

Updated Date - Aug 14 , 2026 | 09:57 PM