ఘోరం.. ప్రియుడి కోసం కన్న తండ్రినే చంపిన మహిళా పోలీస్..
ABN , Publish Date - Mar 28 , 2026 | 08:21 AM
మహరాష్ట్ర చంద్రాపూర్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. పవిత్రమైన పోలీస్ వృత్తిలో ఉండి కన్నతండ్రినే చంపేసింది ఓ యువతి. ప్రేమకు అడ్డు చెప్పాడని ఏకంగా ప్రాణాలే తీసేసింది.
ముంబై: మహరాష్ట్ర చంద్రాపూర్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. పవిత్రమైన పోలీస్ వృత్తిలో ఉండి కన్నతండ్రినే చంపేసింది ఓ యువతి. ప్రేమకు అడ్డు చెప్పాడని ఏకంగా ప్రాణాలే తీసేసింది. తన పోలీస్ తెలివితేటలు వాడి సాధారణ మరణంలా చిత్రీకరించింది. ఇటీవల విషయం బయటపడడంతో ఆమెను అరెస్టు చేశారు పోలీసులు. విచారణలో వెలుగు చూస్తున్న విషయాలు సంచలనం రేపుతున్నాయి.
2023వ సంవత్సరంలో జయంత్ బల్లవార్ అనే పోలీస్ అధికారి చంద్రాపూర్‌లోని జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండేవారు. అతనికి ఆర్య బల్లవార్ అనే కుమార్తె ఉంది. 2022 నుంచి ఆశిష్ షెడ్మేక్, ఆమె ప్రేమించుకుంటున్నారు. వారిద్దరూ పోలీస్ విధుల్లోనే ఉన్నారు. తమ ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పగా ఆర్య తండ్రి పెళ్లికి నిరాకరించారు. దీంతో ఎలాగైనా అతన్ని అడ్డుతప్పించుకోవాలని నిర్ణయించుకున్నారు. తన దగ్గరి బంధువైన చైతన్య గెడమ్(22)ను సంప్రదించింది ఆర్య. అతనికి రూ.5వేలు చెల్లించి విషం తెప్పించింది. ఏప్రిల్ 25వ తేదీ ఉదయం జయంత్ బల్లవార్ ఎప్పటిలాగే విధి నిర్వహణకు వెళ్తుండగా.. విషం కలిపిన మిల్క్‌షేక్‌ను తండ్రికి ఇచ్చింది. అది తాగిన అనంతరం విధులకు వెళ్లిపోయారు. మేజిస్ట్రేట్ కార్యాలయ భవనానికి చేరుకున్న తర్వాత ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయి మరణించారు.
ఆకస్మిక అనారోగ్యానికి గురై జయంత్ మృతిచెంది ఉంటారని పోలీసులు భావించారు. సహజ మరణంలా కనిపించడతో పోస్టుమార్టం చేయకుండానే దహన సంస్కారాలు పూర్తి చేశారు. కేసును సైతం కొట్టివేశారు. జయంత్ బల్లవార్ మరణం తర్వాత ఆర్య, ఆశిష్ ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే, వారి బంధం ఎక్కువకాలం నిలబడలేదు. క్రమశిక్షణారాహిత్యం, దుష్ప్రవర్తన కారణంగా ఆశిష్‌ను పోలీస్ శిక్షణ నుంచి తొలగించారు అధికారులు. ఆర్య ఉద్యోగం చేస్తూ అత్తగారింటికి వెళ్లకుండా పుట్టింట్లోనే నివసిస్తోంది. ఈ విషయాలపై వారికి తరచూ గొడవలు అయ్యేవి. ఆర్యతో విసిగిపోయిన ఆశిష్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నేరాన్ని ఒప్పుకున్నాడు. మూడు సంవత్సరాల కిందట తన భార్య చేసిన విషయాన్ని పూసగుచ్చినట్లు వివరించాడు. సొంత డిపార్ట్‌మెంట్‌లోనే ఇలాంటి ఘటన జరగడంతో షాక్‌కు గురయ్యారు. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్య, ఆశిష్, చైతన్య గెడమ్ సహా వారికి సహకరించిన మరో వ్యక్తిని అరెస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
విదేశీ మహిళతో అసభ్య ప్రవర్తన.. మీద చేతులు వేస్తూ..
‘డిజిటల్ డిటాక్స్’ వద్దంటే.. ‘డిజిటల్ డీ-అడిక్షన్ సెంటర్స్’ తప్పనిసరవుతాయ్.!