60 మంది మావోయిస్టులు.. 15 వేల బలగాలు
ABN , Publish Date - Mar 28 , 2026 | 05:28 AM
ఆపరేషన్ కగార్‌లో తుది అంకం మొదలైంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో మిగిలిన చురుకైన నేత మిసిర్ బెస్రా అలియాస్ సునీల్ లక్ష్యంగా కేంద్ర బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి.
మావోయిస్టు నేత మిసిర్ బెస్రా కోసం వేట
అడవుల్లోకి సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, బీఎస్ఎఫ్ దళాలు
రంగంలో దిగిన మూడు రాష్ట్రాల పోలీసులు
సరందా అడవులను జల్లెడ పడుతున్న బలగాలు
ఏ క్షణంలోనైనా కీలక నేత గణపతి లొంగుబాటు?
హైదరాబాద్, న్యూఢిల్లీ, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ కగార్‌లో తుది అంకం మొదలైంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో మిగిలిన చురుకైన నేత మిసిర్ బెస్రా అలియాస్ సునీల్ లక్ష్యంగా కేంద్ర బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. జార్కండ్‌లోని సరందా అటవీ ప్రాంతంలో 15వేల మంది సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ జవాన్లను మోహరించారు. కేంద్రబలగాలు సరందా అటవీ ప్రాంతాన్ని అడుగడుగునా జల్లెడ పడుతున్నాయి. ఈ ప్రాంతంలో మిసిర్ బెస్రా, రాష్ట్ర కమిటీ నేత ఆసిం మండల్‌తో పాటు 60మంది మావోయిస్టులున్నట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. అటవీప్రాంతం చుట్టూ ఉన్న గ్రామాల్లో, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల ఫోటోలతో పోస్టర్లను అతికించారు. వేట ప్రారంభించిన బలగాలు ఐఈడీ మందుపాతరలను నిర్వీర్యం చేస్తూ ముందుకు కదులుతున్నాయి. గాలింపులో అధునాతన డ్రోన్లను ఉపయోగిస్తున్నాయి. సరందాలో ఉన్న మావోయిస్టుల వద్ద ఏకే 47, ఇన్సాస్ రైఫిళ్లు, గ్రనేడ్ లాంఛర్లు, పెద్ద ఎత్తున ఆయుధాలు ఉన్నట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. 800చదరపు కిలోమీటర్ల సరందా అడవి చుట్టూ ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులు ఉండటంతో 3రాష్ట్రాల బలగాలను తుది ఆపరేషన్‌లో మోహరించారు. ఇలా ఉండగా కీలక నేత గణపతి, ఆయన భార్య రత్నాభాయి, వార్తా శేఖర్, కమాండర్ రేల లొంగిపోతే తెలంగాణ మావోయిస్టులు లేని రాష్ట్రంగా మారినట్లేనని నిఘా వర్గాలంటున్నాయి. దండకారణ్యం ఇప్పటికే మావోయిస్టు రహితంగా మారిందని, కర్రెగుట్టలో మావోయిస్టులు అమర్చి వెళ్లిన ఐఈడీలను చాలావరకు నిర్వీర్యం చేశామని పోలీసులు చెప్పారు.
గణపతి లొంగుబాటుకు సన్నాహాలు!
మావోయిస్టు కీలక నేత గణపతి అలియాస్ ముప్పాల కేశవరావు ఏక్షణంలోనైనా లొంగిపోయే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది మార్చి 31లోపు దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే అనేకమార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గణపతి లొంగుబాటుకు సన్నాహాలు పూర్తయినట్లు తెలుస్తోంది. 30న 193 నిబంధన క్రింద పార్లమెంట్‌లో తీర్మానాన్ని ప్రవేశపెట్టించాలని షా నిర్ణయించడంతో గణపతి లొంగుబాటు ఖాయమని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ నిబంధన కింద అత్యవసర ప్రజాప్రాధాన్యత గల అంశంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంది. టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి, శివసేన ఎంపీ ఏక్‌నాథ్ షిండేతో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టించి స్వల్ప వ్యవధి చర్చ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ తీర్మానంపై చర్చ తర్వాత దేశంలో నక్సలిజాన్ని అంతం చేసేందుకు మోదీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు, సాధించిన విజయాల గురించి షా సభలో వివరించనున్నారు. 2025 మే లో పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, ప్రభాకర్ రావు, పర్కాల్ వీర్, పడకల్ స్వామి, చందన్ రావు, మడ్వి హిడ్మా తదితరులు ఎన్‌కౌంటర్‌లలో హతమవడం, మల్లోజుల వేణుగోపాల్ రావు, దేవ్ జీ, మల్లా రాజ్‌రెడ్డితో పాటు దాదాపు 4వేల మంది మావోయిస్టులు లొంగుబాట పట్టడంతో నక్సలిజం దాదాపు అంతరించినట్లయింది. గణపతి కూడా లొంగిపోతే నక్సలైట్ ఉద్యమాన్ని అంతం చేసినట్లేనని లాంఛనంగా ప్రకటించేందుకు షా సన్నద్ధమవుతున్నారు. గణపతి సోదరుడు రామచందర్ రావు ఇప్పటికే తన సోదరుడిని లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలవాల్సిందిగా అభ్యర్థించారు. కాగా ఈ నెల 4న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్, ఎస్‌ఐబి ఐజీపీ సుమతి తదితరులు షాతో జరిపిన సమావేశంలో గణపతితో పాటు పలువురు మావోయిస్టు నాయకుల లొంగుబాటు, పునరావాసం గురించి చర్చించారు.