‘డిజిటల్ డిటాక్స్’ వద్దంటే.. ‘డిజిటల్ డీ-అడిక్షన్ సెంటర్స్’ తప్పనిసరవుతాయ్.!
ABN , Publish Date - Mar 27 , 2026 | 06:47 PM
సెల్‌ఫోన్.. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకూ ప్రతిఒక్కరి జీవితంలో ఇది భాగమైపోయింది. ముఖ్యంగా చిన్నపిల్లలు దీనికి బానిసలుగా మారతున్నారని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మనకు మనమే క్రమంగా పరిమితులు విధించుకోవాలని ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి సూచించారు.
టెక్నాలజీ విస్తరిస్తున్న నేటితరంలో సెల్‌ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్లు లేకుండా చాలామందికి రోజు గడవడమే కష్టంగా మారింది. ఇవి కొంతవరకు ఉపయోగకరమే అయినప్పటికీ.. వాటిమీద అతిగా ఆధారపడటం ప్రమాదాలకు సంకేతమవుతోంది. ముఖ్యంగా పిల్లలలో ఇది మరింత ప్రభావం చూపుతోంది. కొందరు చిన్నపిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్ ఓ సాధారణ వస్తువుగా మారింది. తినిపించాలన్నా, ఏడుపు ఆపాలన్నా.. చాలామంది తల్లిదండ్రులు స్క్రీన్‌కే మొగ్గుచూపుతున్నారు. ఇది అప్పటికప్పుడు మంచి పరిష్కారమార్గమే అయినా.. దీర్ఘకాలంలో దుష్పరిణామాలకు దారితీసే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
చిన్న వయసులోనే డిజిటల్ పరికరాలకు అలవాటైన పిల్లలు.. సాధారణ జీవనానికి దూరమవుతున్నారని నిపుణులు భావిస్తున్నారు. ఇది వారి శారీరక, మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోతే ఇది మరింత హానికరమవుతుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ‘డిజిటల్ డి-అడిక్షన్ సెంటర్స్’ కూడా పెరిగే అవకాశముందని నిపుణుల అభిప్రాయం. దీనిని ఓ హెచ్చరికగా భావించి.. పిల్లలను డిజిటల్ పరికరాలకు పూర్తిగా దూరం చేయకపోయినా కనీసం పరిమితి విధించడం అత్యవసరం. దీనికి మహారాష్ట్రలోని ఓ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి ‘ఎక్స్’ వేదికగా సోదాహరణంగా వివరించారు.
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా మొహిత్యాంచె వడాగావ్ గ్రామం ఓ ప్రత్యేకమైన ఆచారంతో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. అక్కడ రోజూ సాయంత్రం 7:00 గంటలకు గుళ్లో సైరన్ మోగగానే.. 90 నిమిషాలపాటు సెల్‌ఫోన్లు, టీవీల వంటి డిజిటల్ పరికరాల వాడకాన్ని పూర్తిగా ఆపేస్తారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులంతా ఒకరికొకరు మాట్లాడుకోవడం, పిల్లలు సహజ ఆటలాడటం, పుస్తకాలు చదవడం వంటివి చేస్తుంటారు. డిజిటల్ వ్యసనాన్ని తగ్గిస్తూ కుటుంబ బంధాలను బలపర్చడమే దీని ముఖ్య లక్ష్యంగా భావిస్తున్నారా ఊరిప్రజలు. గ్రామస్థులందరి సహకారంతో ఈ ప్రయత్నం విజయవంతమవుతూ ఇతర ప్రాంతాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆధునిక కాలంలో మానవ సంబంధాలకు ప్రాధాన్యమిచ్చే ఈ వినూత్న నిర్ణయం పలువురి ప్రశంసలు అందుకుంటోంది.
ఇవీ చదవండి:
మంత్రి వీడియో వైరల్.. 'మహా' రాజకీయాల్లో దుమారం.!
సంచలన తీర్పు.. పెళ్లైన పురుషుడు సహజీవనం చేయటం తప్పు కాదు..