Share News

సంచలన తీర్పు.. పెళ్లైన పురుషుడు సహజీవనం చేయటం తప్పు కాదు..

ABN , Publish Date - Mar 27 , 2026 | 03:58 PM

పరస్పర అంగీకారంతో పెళ్లైన పురుషుడు, వయోజనురాలైన (మేజర్) మహిళ సహజీవనం చేయటం తప్పుకాదని, సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవటం కుదరదని అలహాబాద్ కోర్టు తేల్చి చెప్పింది. నైతికత వేరు చట్టం వేరని కోర్టు పేర్కొంది.

సంచలన తీర్పు.. పెళ్లైన పురుషుడు సహజీవనం చేయటం తప్పు కాదు..
Allahabad High Court ruling

ఇంటర్‌నెట్ డెస్క్: అలహాబాద్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పరస్పర అంగీకారంతో పెళ్లైన పురుషుడు, వయోజనురాలైన (మేజర్) మహిళతో సహజీవనం చేయటం తప్పుకాదని, సదరు పురుషుడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవటం కుదరదని కోర్టు తేల్చి చెప్పింది. పౌరుల హక్కులను పరిరక్షించేందుకు తాము తీసుకునే చర్యలు సామాజిక అభిప్రాయం లేదా నైతికతకు లోబడి ఉండవని స్పష్టం చేసింది. ఉత్తర ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన ఓ పెళ్లైన పురుషుడు, పెళ్లి కాని అమ్మాయి సహజీవనం చేస్తున్నారు. యువతి తల్లి ఆ జంటపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.


పోలీసులు వారిపై కేసు ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ కేసును కొట్టి వేయాలంటూ జంట అలహాబాద్ కోర్టును ఆశ్రయించింది. కోర్టులో క్రిమినల్ రిట్ పిటిషన్ వేసింది. జంట వేసిన రిట్ పిటిషన్‌పై కోర్టు తాజాగా విచారణ జరిపింది. జంటకు మద్దతుగా తీర్పును వెలువరించింది. నైతికత వేరు చట్టం వేరని కోర్టు పేర్కొంది. జంటను అరెస్ట్ చేయవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. యువతి కుటుంబసభ్యుల నుంచి జంటకు ఎలాంటి హానీ కలుగకుండా చూసుకోవాలని కూడా ఆదేశించింది.


జంట ఇంటికి వెళ్ల వద్దని యువతి కుటుంబసభ్యులకు సూచించింది. నేరుగా లేదా ఫోన్ ద్వారా లేదా థర్ట్ పార్టీ ద్వారా జంటతో సంప్రదింపులు కూడా జరపవద్దని అంది. జంట భద్రతను స్థానిక పోలీస్ చీఫ్‌కు అప్పగించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 8వ తేదీకి వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి

ధోనీ జట్టులో ఉంటే ఆడాల్సిందే.. లేదా రిటైర్ అయిపోవాలి: రవిచంద్రన్ అశ్విన్

మంత్రి వీడియో వైరల్.. 'మహా' రాజకీయాల్లో దుమారం.!

Updated Date - Mar 27 , 2026 | 04:16 PM