మీ కుమార్తె సుప్రియ సిద్ధంగా ఉన్నారు.. శరద్ పవార్‌తో ప్రధాని మోదీ ఆసక్తికర సంభాషణ!
ABN , Publish Date - Nov 04 , 2026 | 08:52 PM
ఈరోజు (బుధవారం) ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాల్ చేశారు. ఇవాళే పుణెలోని రూబీ ఆసుపత్రి నుంచి శరద్ డిశ్చార్జ్ అయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: ఈరోజు (బుధవారం) ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాల్ చేశారు. ఇవాళే పుణెలోని రూబీ ఆసుపత్రి నుంచి శరద్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిని ప్రధాని ఆత్మీయంగా, గౌరవపూర్వకంగా అడిగి తెలుసుకున్నారు. ‘శరద్.. దయచేసి మీరు పూర్తి విశ్రాంతి తీసుకోండి. మీ కుమార్తె సుప్రియా సూలే ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. దేశం సంగతి మేం చూసుకుంటాం. మీరు అవసరమైన విశ్రాంతి తీసుకోండి’ అని మోదీ సూచించారు. శరద్ పవార్‌కు అత్యంత సన్నిహితుడు విఠల్ మణియార్ ఈ సంభాషణ గురించి మీడియాకు చెప్పారు. అయితే దీన్ని ప్రధాని అధికారికంగా ధ్రువీకరించలేదు.
ప్రధాని కోరినట్టుగానే విశ్రాంతి తీసుకోవడానికి ఎన్సీపీ అధినేత అంగీకరించినట్టు మణియార్ వెల్లడించారు. ‘మీరు అన్నట్టుగానే నేను విశ్రాంతి తీసుకుంటా. మీ లాంటి వారు నిరంతరం దేశం కోసం శ్రమిస్తుంటే.. నాకు ఏ చింతా ఉండదు’ అని శరద్ పవార్ ప్రధాని మోదీతో చెప్పారట. కాగా దగ్గు, ఛాతిలో నొప్పి కారణంగా 85 ఏళ్ల శరద్ సోమవారం రూబీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు కాల్ చేసిన నరేంద్ర మోదీ.. సుప్రియ సిద్ధంగా ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో శరద్ వర్గం బీజేపీతో జతకట్టబోతోందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. సుప్రియా సూలే మోదీ మంత్రివర్గంలోకి కూడా ప్రవేశిస్తారనే ప్రచారమూ సాగుతోంది.
ఈ వార్తలూ చదవండి
ట్రంప్‌నకు ఎదురుదెబ్బ.. మేము కూడా అంటూ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు
ఇది నిరసనల జమానా: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సరదా వ్యాఖ్య