Share News

తమిళనాడు సీఎం విజయ్‌పై మాజీ సీఎం స్టాలిన్ ఆగ్రహం

ABN , Publish Date - May 11 , 2026 | 12:00 PM

తమిళనాడు నూతన సీఎం విజయ్‌పై మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ప్రచారాలు ఆపాలంటూ విజయ్‌కు చురకలంటించారు.

తమిళనాడు సీఎం విజయ్‌పై మాజీ సీఎం స్టాలిన్ ఆగ్రహం
MK Stalin Slams Tamil Nadu CM Vijay

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు గడవకముందే ప్రతిపక్షాలు ఆయనపై విమర్శలకు దిగాయి. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే.స్టాలిన్ విజయ్‌ ప్రసంగాన్ని తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ ఆర్థిక పనితీరును విమర్శించడంపై సీఎం విజయ్‌ను హెచ్చరించారు స్టాలిన్. అప్పులపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్న విజయ్ మాటల్ని తప్పుబట్టిన ఆయన.. అబద్ధపు ప్రచారాలు ఆపాలంటూ చురకలంటించారు.


'ప్రభుత్వం వద్ద డబ్బులేదని వెంటనే చెప్పడం ప్రారంభించవద్దు. డబ్బు ఉంది.. కావాల్సింది దానిని ప్రజలకు ఇవ్వాలనే సంకల్పం, పాలించే సామర్థ్యం. ఐదేళ్లుగా కొవిడ్, వరదల వంటి సంక్షోభాలు సహా కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పోరాడుతూనే.. మేం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశాం. 'గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పును వదిలేసి ఖజానాను ఖాళీ చేసింది' అనే ఆరోపణను మీ మొదటి ప్రసంగంలోనే ప్రస్తావించారు. నిజానికి రాష్ట్రంలో అప్పు పరిమిత స్థాయిలోనే ఉంది. ఫిబ్రవరి బడ్జెట్‌లోనే మేం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని స్పష్టంగా వివరించాం. ఆ విషయం మీకు తెలియదా? మీకు ఓటు వేసిన ప్రజలను మోసం చేసి.. విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయవద్దు! 'ఆచరణాత్మకంగా సాధ్యమయ్యే వాగ్దానాలు మాత్రమే ఇస్తాను' అని చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు.. ఇప్పుడిప్పుడే ప్రభుత్వ పాలనను ప్రారంభిస్తున్నారు. మాలాగే మీరు కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఎలా నెరవేర్చాలనే మెళకువలను త్వరలోనే తప్పకుండా నేర్చుకుంటారని నమ్ముతున్నాను. మీకు ఓటు వేసిన ప్రజలతో పాటు నేనూ అదే ఆశిస్తున్నాను. మీ పాలనలో తమిళనాడు అభివృద్ధి ప్రస్థానం కొనసాగాలని మరోసారి నా శుభాకాంక్షలు!' అని తన సందేశాన్ని ముగించారు స్టాలిన్.


కాగా.. కేంద్రంలో డీఎంకేకు చిరకాల మిత్రపక్షమైన కాంగ్రెస్ మద్దతుతో నిన్న(ఆదివారం) టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం విజయ్‌కు ఎక్స్ వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు స్టాలిన్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే విజయ్ సంతకం చేసిన ప్రకటనలను కూడా ఆయన స్వాగతించారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిరోధక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడం వంటివి ప్రధాన ప్రకటనలలో ఉన్నాయి.


ఇవీ చదవండి:

పరీక్షకు 42 గంటల ముందే 'నీట్' ప్రశ్నాపత్రం లీక్!.. 13 మంది అరెస్ట్

సువేందు అధికారి పీఏ హత్యకేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్

Updated Date - May 11 , 2026 | 12:36 PM