టీఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన మమతా బెనర్జీ
ABN , Publish Date - Mar 20 , 2026 | 06:34 PM
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చేందుకు పట్టుదలగా ఉన్న మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ శుక్రవారంనాడు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చేందుకు పట్టుదలగా ఉన్న మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) శుక్రవారంనాడు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో తాము చేసిన 10 ప్రతిజ్ఞలను (Pledges) టీఎంసీ మరోసారి అధికారంలోకి రాగానే అమలు చేస్తామని మీడియా సమావేశంలో మమత తెలిపారు.
రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తాము ఇచ్చిన 10 వాగ్దానాలను తప్పనిసరిగా అమలు చేస్తామని మమతా బెనర్జీ చెప్పారు. కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వంపై ఎన్డీయే కూటమి కుట్ర పన్నిందని, ఎన్నికల సమయాల్లో జరిగే కుట్రలను తాము చాలానే చూశామని, ఈసారి మాత్రం వాళ్లు అన్నిహద్దులు చెరిపేశారని విమర్శించారు. పశ్చిమబెంగాల్‌లో రాష్ట్రపతి పాలనకు ప్రత్నామ్నాయంగా 'అనధికార రాష్ట్రపతి పాలన'ను బీజేపీ అమలు చేస్తోందని ఆరోపించారు. నియోజకవర్గాలను పునర్విభజించడం ద్వారా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు కేంద్రం, ఈసీఐ ప్లాన్ చేస్తున్నాయని అన్నారు. జనాభా లెక్కలు, ఎన్ఆర్‌సీ పేరుతో ప్రజల పౌరసత్వాన్ని ఊడలాక్కునేందుకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కుట్ర సాగిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియలోనూ ఒక నిర్దిష్ట కమ్యూనిటీని టార్గెట్ చేసినట్టు ఆరోపించారు. బెంగాల్‌పై అసూయ కారణంగానే 'అప్రకటిత రాష్ట్రపతి పాలన'తో మోదీ ఇక్కడ ఫైటింగ్ చేస్తున్నారని అన్నారు.
దీదీ 10 ప్రతిజ్ఞలు
లక్ష్మీభండార్ పథకం కింద రూ.500 పెంపుతో నెలవారీ ఆర్థిక సాయంగా రూ.1,500 అందజేయడం. తద్వారా జనరల్ కేటగిరి లబ్దిదారులకు ఏటా రూ.18,000 ఆర్థిక సాయం లభిస్తుంది. ఎస్సీ/ఎస్టీ లబ్ధిదారులు ప్రతినెలా రూ.1,700 చొప్పున వార్షికంగా రూ.20,400 ఆర్థిక సాయాన్ని పొందుతారు.
బంగ్లార్ యువ-సాథీని కొనసాగించడం. ఈ పథకం కింద నిరుద్యోగ యువత ప్రతినెలా రూ.1,500 చొప్పున ఏటా రూ.18,000 ఆర్థిక సాయం అందుకుంటుంది.
రైతు కుటుంబాలకు సాయం కొనసాగించడం, భూములు లేని రైతులకు భరోసా కల్పించడం, వ్యవసాయరంగం అభివృద్ధి కోసం రూ.30,000 కోట్లతో అగ్రి-బడ్జెట్.
బెంగాల్‌లోని ప్రతి ఒక్క కుటుంబానికి పక్కా గృహం.
ప్రతి ఇంటికి పైపులతో తాగునీరు సౌకర్యం.
ఇంటింటా ఆరోగ్యం కోసం ప్రతి బ్లాక్, పట్టణంలో వైద్య శిబిరాల నిర్వహణ.
బంగ్లార్ శిక్షాయతన్ కింద అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అప్‌గ్రేడేషన్.
ఈస్ట్రన్ ఇండియాకు గేట్‌వే ఆఫ్ ట్రేడ్‌గా బెంగాల్‌ను తీర్చిదిద్దడం. ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్, పోర్ట్స్, వాణిజ్య మౌలిక సదుపాయాలు కల్పించడం, గ్లోబల్ ట్రేడ్ సెంటర్‌గా బెంగాల్‌ను రూపొందించడం.
లబ్ధిదారులందరికీ ఎలాంటి ఆటంకం లేకుండా వృద్ధాప్య పెన్షన్లు.
సమగ్ర జియోగ్రాఫికల్ రీఆర్గనేజేషన్ ద్వారా ఏడు కొత్త జిల్లాల ఏర్పాటు, పట్టణ స్థానిక సంస్థల సంఖ్యను విస్తరించడం.
ఇవి కూడా చదవండి..
బీజేపీతోనే పొత్తు.. ఊహాగానాలకు తెరదించిన పుదుచ్చేరి సీఎం
డీఎంకేలోకి నటి రంజనా నాచ్చియార్