బీజేపీతోనే పొత్తు.. ఊహాగానాలకు తెరదించిన పుదుచ్చేరి సీఎం
ABN , Publish Date - Mar 20 , 2026 | 02:37 PM
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తూత్కుకుడిలోని తిరుచెందూరు ఆలయాన్ని పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి శుక్రవారంనాడు సందర్శించారు. బీజేపీతోనే ఎన్ఆర్ కాంగ్రెస్ పొత్తు ఉంటుందని, నామినేషన్ తేదీ కంటే ముందే సీట్ల పంపకాలు ఖరారు అవుతాయని ఈ సందర్భంగా చెప్పారు.
తూత్తుకుడి: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తూత్కుకుడిలోని తిరుచెందూరు ఆలయాన్ని పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి (N Rangasamy) శుక్రవారంనాడు సందర్శించారు. బీజేపీతోనే ఎన్ఆర్ కాంగ్రెస్ పొత్తు ఉంటుందని, నామినేషన్ తేదీ కంటే ముందే సీట్ల పంపకాలు ఖరారు అవుతాయని ఈ సందర్భంగా చెప్పారు. ఆయన ప్రకటనతో పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమికి ఎన్ఆర్ కాంగ్రెస్ సారథ్యం వహించనుందనే విషయం స్పష్టమైంది. నామినేషన్ దాఖలుకు ముందు తిరుచెందూరు ఆలయాన్ని రంగస్వామి సందర్శించారు. ఈ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి ఆయన నామినేషన్ వేయనున్నట్టు తెలుస్తోంది.
విజయ్ పార్టీతో పొత్తు ఊహాగానాలు
రంగస్వామి ఈసారి ఎన్నికల్లో ఎన్డీయేతో పొత్తు వదులుకుని నటుడు విజయ్ టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకుంటారనే ఊహాగానాలు కొద్దిరోజులుగా వినిపిస్తూ వచ్చాయి. అయితే బీజేపీ వెంటనే రంగంలోకి దిగి ఎన్నికల ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి మన్షుక్ మాండవీయను ప్రత్యేక విమానంలో పుదుచ్చేరి పంపింది. ఆయన దౌత్యం ఫలించింది.
కాంగ్రెస్-డీఎంకే కూటమిలో ప్రతిష్టంభన
మరోవైపు, పుదుచ్చేరిలో కాంగ్రెస్, డీఎంకే మధ్య పొత్తుల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. గతంలో పుదుచ్చేరిలో సెక్యులర్ ప్రొగ్రసివ్ అలయెన్స్‌కు కాంగ్రెస్ సారథ్యం వహించింది. ఈసారి కూడా ఇందుకు పట్టుబడుతోంది. అయితే తమిళనాడు తరహాలోనే పుదుచ్చేరిలోనూ కూటమికి తామే సారథ్యం వహిస్తామని డీఎంకే బలంగా చెబుతోంది.
23తో ముగియనున్న నామినేషన్ల గడువు
పుదుచ్చేరిలో నామినేషన్ల గడువు ఈనెల 23వ తేదీ సోమవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పుదుచ్చేరిలో కాంగ్రెస్‌తో కూటమికి సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఒకటి రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
డీఎంకేలోకి నటి రంజనా నాచ్చియార్
రాజ్యసభ సభ్యుల్లో 31 మంది బిలియనీర్లు