రాజ్యసభ సభ్యుల్లో 31 మంది బిలియనీర్లు
ABN , Publish Date - Mar 20 , 2026 | 05:58 AM
రాజ్యసభ ఎంపీల్లో 31 మంది బిలియనీర్లు ఉండగా వారిలో తెలుగు రాష్ట్రాల ఎంపీలే 9మంది ఉన్నారు. వారిలో నలుగురు తెలంగాణకు, ఐదుగురు ఏపీకి చెందినవారు.
వారిలో 9 మంది తెలుగు రాష్ట్రాల ఎంపీలే
అందులో నలుగురు టాప్ 10 జాబితాలో
రూ.5,300 కోట్లతో బండి పార్థసారథి పస్ట్
మూడో స్థానంలో వైసీపీ అయోధ్యరామిరెడ్డి
ఏడీఆర్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ, మార్చి 19(ఆంధ్రజ్యోతి): రాజ్యసభ ఎంపీల్లో 31 మంది బిలియనీర్లు ఉండగా వారిలో తెలుగు రాష్ట్రాల ఎంపీలే 9మంది ఉన్నారు. వారిలో నలుగురు తెలంగాణకు, ఐదుగురు ఏపీకి చెందినవారు. అత్యధిక ఆస్తులున్న ఎంపీల్లో బండి పార్థసారథి (బీఆర్‌ఎస్) రూ.5,300 కోట్లతో ప్రథమ స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో ఆప్ ఎంపీ రాజీందర్ గుప్తా (రూ.5,053 కోట్లు), మూడో స్థానంలో వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి (రూ.2,577 కోట్లు) ఉన్నారు. టాప్ 10 బిలియనీర్లలో తెలుగు రాష్ట్రాల నుంచి బండి పార్థసారథితో పాటు అయోధ్య రామిరెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ, మేడా రఘునాథ్ రెడ్డి ఉన్నారు. 31 మంది బిలియనీర్లలో బీజేపీ (6), కాంగ్రెస్ (5), వైసీపీ (4), బీఆర్‌ఎస్ (2), టీడీపీకి చెందిన ఒకరు ఉన్నారు. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) గురువారం ఓ నివేదిక విడుదల చేసింది. ఏడీఆర్.. 233 మందికి గాను 229 మంది రాజ్యసభ సభ్యుల అఫిడవిట్లను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించింది. రాజ్యసభ ఎంపీల సగటు ఆస్తి రూ.120.69 కోట్లు అని నివేదిక పేర్కొంది. రాజ్యసభ ఎంపీల మొత్తం ఆస్తులు రూ.27,638 కోట్లు కాగా, రాష్ట్రాలవారీగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడుగురు ఎంపీలు అత్యధికంగా మొత్తం రూ.8,130 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. పంజాబ్ రెండో స్థానంలో ఉండగా, ఏపీ మూడో స్థానంలో ఉంది. పార్టీల వారీగా అత్యధికంగా ఆప్‌కు చెందిన 10 మంది ఎంపీలు మొత్తం రూ.5,740 కోట్లు, బీఆర్‌ఎ్‌సకు చెందిన ముగ్గురు ఎంపీలు రూ.5,524 కోట్లు, వైసీపీకి చెందిన ఏడుగురు ఎంపీలు మొత్తం రూ.3,658 కోట్లు ఆస్తులు కలిగి ఉన్నారు. పార్టీలవారీగా ఎంపీల సగటు ఆస్తుల్లో ఆప్ (రూ.574.09 కోట్లు) ముందుంది. రెండో స్థానంలో ఏడుగురు వైసీపీ ఎంపీలు రూ.522.63 కోట్ల సగటు ఆస్తులు కలిగి ఉన్నారు. ఇటీవల తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సింఘ్వీకి రూ.2,558 కోట్లు, వేం నరేందర్ రెడ్డి రూ.41కోట్ల ఆస్తులు న్నాయి. మరోవైపు, ఆప్ ఎంపీ సంత్ బల్బీర్ సింగ్ రూ.3 లక్షలతో అతి తక్కువ ఆస్తులు ఉన్న ఎంపీగా నిలిచారు. అతి తక్కువ ఆస్తులు ఉన్న 10 మంది ఎంపీల్లో ఇద్దరు సీపీఎం నేతలు ఉండడం గమనార్హం. కాగా, రాజ్యసభ ఎంపీల్లో 73 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. సీరియస్ క్రిమినల్ కేసులున్న వారు 36 మంది. తెలంగాణలో ఐదుగురిపై, ఏపీలో ముగ్గురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.