ఎల్‌పీజీ పరిస్థితి ఆందోళనకరమే!
ABN , Publish Date - Mar 20 , 2026 | 04:58 AM
దేశంలో వంట గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌లు పశ్చిమాసియాలో యుద్ధానికి ముందున్న సాధారణ స్థాయిలకు చేరుకుంటున్నాయి.
కానీ డిస్ర్టిబ్యూటర్ల వద్ద నిల్వలు అయిపోలేదు
కేంద్ర పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ
న్యూఢిల్లీ, మార్చి 19: దేశంలో వంట గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌లు పశ్చిమాసియాలో యుద్ధానికి ముందున్న సాధారణ స్థాయిలకు చేరుకుంటున్నాయి. దీంతో పరిస్థితి క్రమంగా సాధారణ స్థాయికి చేరుకుంటోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో సరఫరాలో అంతరాయాల వల్ల హోటళ్లతోపాటు వాణిజ్య వినియోగదారులపై విధించిన పరిమితులు ఇంకా అమల్లో ఉండటంతో ఇబ్బందులు తప్పడంలేదు. మరోవైపు ఆందోళనలతో చేసే గృహావసర వంట గ్యాస్ బుకింగ్‌లు తగ్గుముఖం పడుతున్నాయని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న ఎల్‌పీజీని గృహ వినియోగదారులకు సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఎల్‌పీజీ (సరఫరా) పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని, అయితే ఏ ఒక్క ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ వద్ద నిల్వలు పూర్తిగా అయిపోలేదని పేర్కొన్నారు. గత రెండు వారాల్లో దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తి 40 శాతానికి పైగా పెరిగిందని తెలిపారు. ప్రభుత్వరంగంలోని మూడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు యుద్ధానికి ముందున్న సాధారణ స్థాయిలోనే ఎల్‌పీజీ రీఫిళ్ల డెలివరీలు చేస్తున్నాయన్నారు. కాగా, ఎల్‌పీజీ బుకింగ్‌లకు సంబంధించిన సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం గురువారం సూచించింది.