పశ్చిమాసియా సంక్షోభం.. మోదీ ప్రభుత్వ వైఖరికి శశి థరూర్ మద్దతు
ABN , Publish Date - Mar 20 , 2026 | 04:10 PM
పశ్చిమాసియా సంక్షోభం విషయంలో మోదీ ప్రభుత్వ వైఖరికి కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ మద్దతు తెలిపారు. నిగ్రహం పాటించడం బలహీనత కాదని, అది గొప్ప బలమని అన్నారు.
న్యూఢిల్లీ, మార్చి 20: ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. సంక్షోభం తాలూకా ప్రభావం ప్రపంచ దేశాలపై పడింది. ఆయిల్, గ్యాస్, ఎరువుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. భారత దేశంలోనూ గ్యాస్, ఆయిల్ కొరత ఏర్పడింది. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం పశ్చిమాసియా సంక్షోభంపై గట్టిగా స్పందించకపోవటంపై ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని మోదీ అమెరికా చేతిలో తోలు బొమ్మగా మారిపోయారని, అందుకే యుద్ధంపై మాట్లాడటం లేదని విమర్శిస్తున్నారు.
మోదీ ప్రభుత్వ వైఖరికి శశి థరూర్ మద్దతు
పశ్చిమాసియా సంక్షోభం విషయంలో మోదీ ప్రభుత్వ వైఖరికి కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ మద్దతు తెలిపారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘నిగ్రహం పాటించడం బలహీనత కాదు, అది గొప్ప బలం. కేంద్ర ప్రభుత్వానికి భారతీయుల భద్రత, ఇంధన అవసరాలు చాలా ముఖ్యం. ఇరు దేశాలతో భారత్ దౌత్యపరమైన చర్చలు జరపాలని కోరుకుంటున్నా. పశ్చిమాసియాలో శాంతి నెలకొనడం భారత్‌కు ఎంతో అవసరం. చాలా వరకు ఆయిల్, గ్యాస్ సరఫరా దెబ్బతింది. కొంత మొత్తంలో కూడా భారత్‌కు ఆయిల్, గ్యాస్ సరఫరా అవ్వటం లేదు’..
‘యుద్ధం మొదలైనపుడు బ్యారెల్ ఆయిల్ ధర 64 డాలర్ల దగ్గర ఉంది. ఇప్పుడు 100 డాలర్ల నుంచి 120 డాలర్ల మధ్యకు చేరింది. పెట్రోల్ కొరత చాలా తీవ్రంగా ఉంది. అది అన్నిటిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. చివరగా నేనేం చెబుతానంటే.. మనం బ్యారెల్ విషయంలో బాగా ఇరుక్కుపోయాము. మనమే కాదు చాలా దేశాలది ఇదే పరస్థితి’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
ప్రీమియం పెట్రోల్ ధర రూ.2.35 పెంపు
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు..