ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు..
ABN , Publish Date - Mar 20 , 2026 | 03:34 PM
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డుపై వెళుతున్న ఇతర వాహనాలను ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
చెన్నై, మార్చి 20: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డుపై వెళుతున్న ఇతర వాహనాలను ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన సేలం జిల్లాలో గురువారం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గురువారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సు కోయంబత్తూరు నుంచి సేలం బయలుదేరింది. బస్సు ఉత్తమ శోలపురం దగ్గర హైవేపై వెళుతుండగా అదుపుతప్పింది. డివైడర్‌ను దాటుకుని అవతలి వైపు రోడ్డుపైకి దూసుకెళ్లింది. ఆ రోడ్డుపై వెళుతున్న ఓ బైక్‌తో పాటు టెంపోను ఢీకొట్టింది. బైక్, టెంపో నుజ్జునుజ్జయ్యాయి. బైకుపై ప్రయాణిస్తున్న ఓ మహిళతో పాటు ఆమె కూతురు అక్కడికక్కడే మరణించారు. ఇక.. టెంపోలో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 11 నెలల చంటిపాప కూడా ఉండటం విషాదకరం.
సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ సభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు మొదలుపెట్టారు. గాయపడినవారిని చికిత్స కోసం దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతివేగం కారణంగానే బస్సు అదుపుతప్పి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై సీనియర్ పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ప్రమాదానికి సంబంధించి పూర్తి దర్యాప్తు జరుగుతోంది. దర్యాప్తు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
చంపేస్తామంటూ కేంద్ర మంత్రికి బెదిరింపులు
కల్తీ చేస్తే కఠిన చర్యలు.. డీసీపీ గైక్వాడ్ వైభవ్ హెచ్చరిక