అఫిడవిట్లలో రూ.100 కోట్ల తేడా.. టీవీకే చీఫ్ విజయ్‌కు మద్రాసు హైకోర్టు నోటీసులు
ABN , Publish Date - Apr 20 , 2026 | 04:47 PM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ప్రధాన పార్టీలతో తలబడుతున్న టీవీకే చీఫ్ విజయ్‌కు మద్రాసు హైకోర్టు షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల కోసం పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల్లో విజయ్ దాఖలు చేసిన అఫిడవిట్లతో వ్యత్యాసాలు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై విజయ్‌కు నోటీసులు జారీ చేసింది.
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ప్రధాన పార్టీలతో తలబడుతున్న టీవీకే చీఫ్ విజయ్ (Vijay)కు మద్రాసు హైకోర్టు షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల కోసం పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల్లో విజయ్ దాఖలు చేసిన అఫిడవిట్లతో వ్యత్యాసాలు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై విజయ్‌కు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు ఐటీ ఇన్వెస్టిగేషన్ డెరెక్టర్ జనరల్, ఈసీఐ, పెరంబూరు, తిరుచ్చి (ఈస్ట్) రిటర్నింగ్ అధికారులకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
రెండు నియోజకవర్గాల్లోనూ పోటీ చేసేందుకు విజయ్ సమర్పించిన అఫిడవిట్లలో వ్యత్యాసాలు ఉన్నాయని చెన్నైకి చెందిన వి.విఘ్నేశ్ పిటిషన్ వేశారు. రెండు అఫిడవిట్ల మధ్య రూ.105 కోట్ల భారీ వ్యత్యాసంపై ఆదాయం పన్ను శాఖ దర్యాప్తు చేయాలని పిటిషనర్ కోరారు.
ఈ పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ ధర్మాధికారి, జస్టిస్ జి అరుళ్ మురుగన్‌తో కూడిన ధర్మాసనం సోమవారంనాడు విచారణ జరిపింది. ఒక నియోజకవర్గంలో వంద కోట్లకు పైగా ఆస్తులను వెల్లడించకపోవడం అక్రమమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విజయ్, తదితరులకు నోటీసులు జారీ చేసింది. దీంతో తదుపరి విచారణలో ఏమి జరుగుతుందనేది ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. ఈనెల 23, 29 తేదీల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది.
ఇవి కూడా చదవండి..
15 ఏళ్లు తక్కువేం కాదు, ఈసారి బెంగాల్‌లో బీజేపీ పాగా... రాజ్‌నాథ్ సింగ్
మణిపుర్ మంటలకు బీజేపీనే కారణం: రాహుల్