15 ఏళ్లు తక్కువేం కాదు, ఈసారి బెంగాల్‌లో బీజేపీ పాగా... రాజ్‌నాథ్ సింగ్
ABN , Publish Date - Apr 20 , 2026 | 04:07 PM
పశ్చిమబెంగాల్‌లో దశాబ్దానికి పైగా టీఎంసీ అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ మార్పును తీసుకురావాలని ఓటర్లను కోరారు.
బీర్భూమ్: పశ్చిమబెంగాల్‌లో దశాబ్దానికి పైగా టీఎంసీ అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ మార్పును తీసుకురావాలని ఓటర్లను కోరారు. సోమవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు వరుసగా మూడుసార్లు టీఎంసీకి అధికారం ఇచ్చారని, 15 ఏళ్లు అంటే అదేమంత తక్కువ సమయం కాదని చెప్పారు. దేశంలోని చాలా రాష్ట్రాలు కేవలం 5 నుంచి 8 ఏళ్లలో అభివృద్ధి సాధించాయని, దేశ ఆర్థిక వృద్ధిలో 10 శాతంగా ఉన్న పశ్చిమబెంగాల్ టీఎంసీ అధికారంలోకి వచ్చాక 5 శాతానికి పడిపోయిందని తెలిపారు.
పశ్చిమబెంగాల్ ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారని, ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఈసారి బీజేపీకి బాసటగా నిలవాలని రాజ్‌నాథ్ సింగ్ కోరారు. 'భయాందోళనల మధ్య ఇక్కడి ప్రజలు కాలం నెట్టుకొస్తున్నారు. వారందరికీ ఒకటే చెప్పదలచుకున్నాను. ఈసారి మార్పు తప్పనిసరిగా రావాలి. బీజేపీకి మీరంతా అండగా నిలబడాలి' అని విజ్ఞప్తి చేశారు. మహిళా సాధికారతకు కేంద్రం కట్టుబడి ఉందని, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రధానమంత్రి మోదీ స్థిరనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. 'ఇవాళ కాకపోతే, రేపు అది జరిగి తీరుతుంది' అని భరోసా ఇచ్చారు.
మెజారిటీ ఎంతంటే..
పశ్చిమబెంగాల్‌లో బీజేపీ విజయావకాశాలపై రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని సీట్లు వస్తాయనేది చెప్పలేను కానీ, బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చితీరుతుందన్నారు. మూడింట రెండు వంతుల సీట్లు ఖాయమని చెప్పారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు విడతలుగా ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
మణిపుర్ మంటలకు బీజేపీనే కారణం: రాహుల్
కష్టపడే మనస్తత్వం, తెలివితేటలు.. ఇవే తమిళ ప్రజల విజయరహస్యం: చంద్రబాబు