మణిపుర్ మంటలకు బీజేపీనే కారణం: రాహుల్
ABN , Publish Date - Apr 20 , 2026 | 03:04 PM
మణిపుర్‌లో తలెత్తిన తాజా ఉద్రిక్తతలపై బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తప్పుపట్టారు. మణిపుర్‌ను బీజేపీ మంటల్లోకి నెట్టిందని, అక్కడి మైతీ, కుకీ తెగల మధ్య ఘర్షణలకు అధికార పార్టీనే కారణమని అన్నారు.
కన్యాకుమారి: మణిపుర్‌లో తలెత్తిన తాజా ఉద్రిక్తతలపై బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) తప్పుపట్టారు. మణిపుర్‌ను బీజేపీ మంటల్లోకి నెట్టిందని, అక్కడి మైతీ, కుకీ తెగల మధ్య ఘర్షణలకు అధికార పార్టీనే కారణమని అన్నారు. తమిళనాడులోని కలచేల్‌లో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మణిపుర్ ప్రశాంతంగా ఉండే రాష్ట్రమని, అక్కడ మంటపెట్టారని, వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని, ఇప్పటికీ అక్కడ పౌరయుద్ధం జరుగుతూనే ఉందని అన్నారు.
మణిపుర్‌లోని ట్రోంగ్లావోబి ఆవాంగ్ లీకై ప్రాంతలో ఈనెల 7న జరిగిన మిలిటెంట్ దాడిలో ఐదేళ్ల బాలుడు, 5 నెలల చిన్నారి మరణించడంతో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. జనం ఆగ్రహంతో ప్రధాన రోడ్లను దిగ్బంధించారు. పలుచోట్ల హింసకు దిగారు. భద్రతా బలగాలు టియర్ గ్యాస్, స్మోక్ బాంబులతో ఆందోళనకారులను చెదరగొట్టారు.
మణిపుర్ తరహాలోనే..
మణిపుర్ తరహాలోనే అన్ని రాష్ట్రాల్లో అధికారం గుప్పిట్లో పెట్టుకుని ఢిల్లీ నుంచి పాలించాలన్నదే బీజేపీ ఉద్దేశమని రాహుల్ అన్నారు. తమిళనాడులోనూ ఇప్పుడు అన్నాడీఎంకేను కంట్రోల్‌లో పెట్టుకుని ఢిల్లీ నుంచి పాలించాలనుకుంటోందని ఆరోపించారు. 'ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవడం, ఢిల్లీ నుంచి పాలించడం బీజేపీ పని. ఇదే విషయాన్ని తమిళ ప్రజలకు చెప్పే ధైర్యం వాళ్లకు లేదు. అందువల్లే ఒకప్పుడు ఎంతో పేరున్న పార్టీని తన కంట్రోల్‌లోకి తీసుకుంది' అని రాహుల్ వ్యాఖ్యానించారు. తమిళనాడు ప్రగతిలో అన్నాడీఎంకే కీలకపాత్ర వహించిందని, అయితే ఇప్పుడు అదంతా గతమని, ఆపార్టీలో ఇప్పుడు ఉన్నదంతా శూన్యమేనని అన్నారు. బీజేపీకి ఒక ఉపకరణంగా మాత్రమే అన్నాడీఎంకే మిగిలిందన్నారు. ఆ పార్టీ నాయకత్వం అవినీతి కారణంగానే బీజేపీకి లొంగిపోయిందని విమర్శించారు. ప్రతి రాష్ట్రానికి సొంత వాణి ఉండాలని, ప్రజలే రాష్ట్రాన్ని పాలించుకోవాలని, ఈ సంప్రదాయాలన్నింటికీ బీజేపీ వ్యతిరేకమని అన్నారు. తమిళనాడులో ప్రజాపాలన సాగాలన్నదే తమ అభిమతమని చెప్పారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 23న జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
చెన్నై కోసం డీఎంకే ప్రత్యేక మేనిఫెస్టో
కష్టపడే మనస్తత్వం, తెలివితేటలు.. ఇవే తమిళ ప్రజల విజయరహస్యం: చంద్రబాబు