Share News

ఎల్‌పీజీ కస్టమర్లకు హెచ్చరిక.. ఫేక్ ఓటీపీల నయా మోసం!

ABN , Publish Date - May 11 , 2026 | 02:22 PM

సైబర్ నేరగాళ్లు ఎల్‌పీజీ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా మోసాలకు పాల్పడుతుండటంపై ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు స్పందించాయి. వినియోగదరాలు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశాయి.

ఎల్‌పీజీ కస్టమర్లకు హెచ్చరిక.. ఫేక్ ఓటీపీల నయా మోసం!

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా సైబర్ మోసాలకు తెరలేపుతున్నారు సైబర్ కేటుగాళ్లు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. హిందుస్థాన్ పెట్రోలియం(HPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), భారత్ పెట్రోలియం(BPCL) వంటి కంపెనీలు వినియోగదారులను అప్రమత్తం చేశాయి. గ్యాస్ సిలిండర్ డెలివరీ పేరుతో నకిలీ ఎస్ఎమ్ఎస్‌లు, వాట్సాప్ సందేశాలు పంపిస్తూ కేటుగాళ్లు కస్టమర్ల నుంచి ఓటీపీ, డీఏసీ(డెలివరీ అథంటికేషన్ కోడ్)లను దోచుకునేందుకు యత్నిస్తున్నారని వెల్లడించాయి.


ఇటీవలి కాలంలో.. సైబర్ నేరగాళ్లు గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులుగా పరిచయం చేసుకుంటూ కస్టమర్లకు ఫోన్ చేస్తున్నారు. 'కేవైసీ అప్డేట్ చేయాలి, ఆధార్ లింక్ చేయాలి.. లేదంటే కనెక్షన్ నిలిపివేస్తాం' లాంటి మాటలతో ఓటీపీలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. కొందరికి అఫీషియల్ ఎల్‌పీజీ డెలివరీ మెసేజ్లలాగే ఫేక్ సందేశాలు పంపి, అందులోని కోడ్‌ను చెప్పాలని అడుగుతున్నారని చమురు సంస్థలు తెలిపాయి. అధికారిక డెలివరీ మెసేజ్‌లు ఎల్లప్పుడూ ఆయా కంపెనీల గుర్తింపు పేరుతోనే వస్తాయని వెల్లడించాయి. అందులో 4 అంకెల ఓటీపీ మాత్రమే ఉంటుందని పేర్కొన్నాయి. ఆ కోడ్‌ కేవలం సిలిండర్ డెలివరీ సమయంలో సంబంధిత సిబ్బందికే చెప్పాలని స్పష్టం చేశాయి. ఫోన్ కాల్స్, వాట్సాప్ లేదా ఇతర అనుమానాస్పద లింక్‌ల ద్వారా ఎవరు ఓటీపీ అడిగినా స్పందించొద్దని సూచించాయి.


అయితే.. ఆయా వినియోగదారులు అధికారిక యాప్‌, వెబ్‌సైట్‌ల ద్వారానే గ్యాస్ బుకింగ్, కేవైసీ అప్డేట్‌ చేయాలని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు. వ్యక్తిగత మొబైల్ నంబర్ల నుంచి వచ్చే వాట్సాప్ సందేశాలు, అనుమానాస్పద లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఈ తరహా మోసాలకు గురైనట్టయితే.. వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలన్నారు. 'గోల్డెన్ అవర్'లో ఫిర్యాదు చేస్తే మోసపోయిన డబ్బును ఫ్రీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.


ఇవీ చదవండి:

పరీక్షకు 42 గంటల ముందే 'నీట్' ప్రశ్నాపత్రం లీక్!.. 13 మంది అరెస్ట్

సువేందు అధికారి పీఏ హత్యకేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్

Updated Date - May 11 , 2026 | 03:15 PM