విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత త్రిష తొలి పోస్ట్.. ఏమన్నారంటే?
ABN , Publish Date - May 11 , 2026 | 01:11 PM
తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నటి త్రిషా కృష్ణన్ హాజరై భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. అనంతరం.. ఆమె సంప్రదాయ లుక్‌లో కనిపిస్తూ ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు చేశారు. ప్రస్తుతం.. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పులకు నాంది పలికిన టీవీకే చీఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఈ ఈవెంట్‌కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ నటి త్రిషా కృష్ణన్ విచ్ఛేయడం ప్రత్యేకార్షణగా నిలుస్తోంది. కొంతకాలంగా విజయ్-త్రిషల మధ్య సాన్నిహిత్యంపై సోషల్ మీడియాలో ఊహాగానాలు జోరందుకున్న నేపథ్యంలో తాజా ఘటన మరింత చర్చకు దారితీసింది. ఈ కార్యక్రమం అనంతరం త్రిష తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోలను షేర్ చేశారు. సీఫోమ్ గ్రీన్ శారీలో సంప్రదాయ లుక్‌లో మెరిసిన ఆమె.. 'The love is always louder' అనే క్యాప్షన్‌ను జోడించారు. ఈ పోస్ట్ కాస్తా వైరల్ అవ్వగా.. నెటిజన్లు ఆ వ్యాఖ్యను విజయ్‌తో అనుసంధానం చేస్తూ విస్తృతంగా చర్చిస్తున్నారు.
విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో త్రిష భావోద్వేగానికి గురైన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. విజయ్ ప్రసంగం సమయంలో ఆమె కళ్లలో ఆనందబాష్పాలు కనిపించిన సందర్భంపై అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు విజయ్ భార్య సంగీత, పిల్లలు ఈ కార్యక్రమానికి హాజరుకాని సంగతి తెలిసిందే. ఇక.. విజయ్, త్రిషలు తమిళ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందారు. వీరిరువురూ ‘గిల్లి’, ‘తిరుపాచి’, ‘ఆతి’, ‘కురువి’, ‘లియో’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. వీరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ఇటీవల కొన్ని వేడుకలకు ఇద్దరూ కలిసి హాజరుకావడం, సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు పరోక్ష పోస్టులు పెట్టడం వంటివి మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇటీవల విజయ్ విడాకుల ఫైలింగ్‌ల వివరాలు బహిర్గతమైన అనంతరం సోషల్ మీడియాలో వీరిపై ట్రోలింగ్స్ మరింత పెరిగాయి. కొందరు రాజకీయ నాయకులు కూడా స్వప్రయోజనాల కోసం విజయ్‌ను విమర్శిస్తూ ఈ ఆరోపణల్ని ప్రస్తావించారు.
కాగా.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం(టీవీకే) 108 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం), వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ మార్కును అందుకుంది. ఈ నేపథ్యంలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్.. విజయ్‌ను లాంఛనంగా ముఖ్యమంత్రిగా నియమించి, మే 13 లోగా అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవాలని కోరారు.
ఇవీ చదవండి:
పరీక్షకు 42 గంటల ముందే 'నీట్' ప్రశ్నాపత్రం లీక్!.. 13 మంది అరెస్ట్
సువేందు అధికారి పీఏ హత్యకేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్