Share News

ప్రముఖ పాండవాణి గాయని తీజన్ బాయి కన్నుమూత

ABN , Publish Date - Jul 05 , 2026 | 10:52 AM

ప్రముఖ పాండవాణి ఫోక్ సింగర్ తీజన్ బాయి కన్నుమూశారు. వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

ప్రముఖ పాండవాణి గాయని తీజన్ బాయి కన్నుమూత
Legendary Pandavani Folk Singer Teejan Bai

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ పాండవాణి జానపద కళాకారిణి, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత తీజన్ బాయి(70) కన్నుమూశారు. కొంతకాలంగా వయో సంబంధిత ఆనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆమె.. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తీజన్ మరణంతో భారతీయ జానపద కళారంగంలో ఓ సువర్ణ అధ్యాయం ముగిసినట్లయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తీజన్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. భారతీయ సంస్కృతికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. దేశవ్యాప్తంగా కళాకారులు, సాంస్కృతిక రంగ ప్రముఖులూ ఆమెకు ఘన నివాళులర్పిస్తున్నారు.


తీజన్ బాయి.. 1956 ఆగస్టు 8న ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లా గనియారి గ్రామంలో పార్ధీ గిరిజన కుటుంబంలో జన్మించారు. 13 ఏళ్లకే తొలి బహిరంగ ప్రదర్శన ఇచ్చిన ఆమె.. అప్పటివరకు మహిళలు కూర్చుని చేసే 'వేదమతి'కి భిన్నంగా, వేదికపై నిల్చుని చేతిలో తంబూరాతో హావభావాలు ప్రదర్శించే 'కపాలిక్' శైలిని అవలంబించారు. అప్పటివరకు పురుషులకే పరిమితమైన ఈ శైలిలో ఆమె చేసిన ప్రదర్శనలు పాండవాణికి సరికొత్త గుర్తింపు తెచ్చాయి. ఎందరో మహిళా జానపద కళాకారిణులకు స్ఫూర్తిగా నిలిచాయి. అయితే.. ఓ మహిళగా బహిరంగ ప్రదర్శనలివ్వడాన్ని సమాజం వ్యతిరేకించింది. బాల్య వివాహం తర్వాత సామాజిక బహిష్కరణను ఎదుర్కొన్నారు. ఎన్నో కష్టాలను అధిగమిస్తూ తన కళాసాధనను కొనసాగించారామె. అనంతరం ప్రముఖ రంగస్థల దర్శకుడు హబీబ్ తన్వీర్ ఆమె ప్రతిభను గుర్తించి జాతీయ స్థాయికి పరిచయం చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సమక్షంలో ప్రదర్శన ఇవ్వడం ఆమె జీవితంలో కీలక మలుపుగా నిలిచింది.


అలా మహాభారత గాథలను తనదైన గాత్రం, అభినయంతో ఆవిష్కరించి అంతర్జాతీయ గుర్తింపు పొందారు తీజన్ బాయి. భారతీయ జానపద సంప్రదాయాలను పరిరక్షించడంలో ఆమె విశేష కృషిచేశారు. కళారంగంలో ఆమె చేసిన అమూల్యమైన సేవలకు గాను భారత ప్రభుత్వం 1988లో పద్మశ్రీ, 1995లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 2003లో పద్మభూషణ్, 2019లో దేశ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌తో ఆమెను గౌరవించింది. 2018లో ఓ అంతర్జాతీయ అవార్డునూ గెలుచుకున్నారామె.


ఇవీ చదవండి:

'బాస్ ఎవరో ఆయనకు తెలుసు'.. నెతన్యాహుపై ట్రంప్ వ్యాఖ్యలు

ఇరాన్ చర్చలపై అమెరికా మీడియా కథనం.. 'ఫేక్ న్యూస్'గా కొట్టిపారేసిన ఇజ్రాయెల్

Updated Date - Jul 05 , 2026 | 11:21 AM