Rohini Acharya: మా వారసత్వాన్ని భ్రష్టు పట్టించేందుకు సొంత వ్యక్తులు చాలు.. లాలూ కుమార్తె
ABN , Publish Date - Jan 10 , 2026 | 06:21 PM
ఎంతో కష్టపడి కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టిన వారి మూలాలను చెరిపేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు తనను దిగ్భ్రాంతికి గురిచేసినట్టు రోహిణి ఆచార్య తెలిపారు. అజ్ఞానం అనే ముసుగు ఉన్నప్పుడు అహంకారం తలకెక్కుతుందని అన్నారు.
పాట్నా: ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కుమార్తె రోహిణి ఆచార్య (Rohini Acharya) మరోసారి వార్తల్లోకి వచ్చారు. నేరుగా పేరు ప్రస్తావించకుండానే తన సోదరుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తమ వారసత్వాన్ని నాశనం చేయడానికి సొంత వ్యక్తులే సరిపోతారని, బయట వ్యక్తుల అవసరమే లేదని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు.
ఎంతో కష్టపడి కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టిన వారి మూలాలను చెరిపేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు తనను దిగ్భ్రాంతికి గురిచేసినట్టు రోహిణి ఆచార్య తెలిపారు. అజ్ఞానం అనే ముసుగు ఉన్నప్పుడు అహంకారం తలకెక్కుతుందని, అప్పుడు వినాశక శక్తులు అప్రమత్తమై ఒక వ్యక్తి ఆలోచన, నిర్ణయాలను నియంత్రిస్తుంటాయని ఆక్షేపణ తెలిపారు.
చిచ్చు మొదలైందిలా..
ఇటీవల ముగిసిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర వైఫల్యంతో లాలూ ఫ్యామిలీలో వివాదం మొదలైంది. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ 140 సీట్లలో పోటీ చేసి కేవలం 25 సీట్లకు పరిమితం కాగా, ఎన్డీఏ భారీ మెజారిటీతో గెలుపొందింది. బీజేపీ 89, జేడీ(యూ) 85 సీట్లు గెలుచుకోగా, మొత్తం 243 మంది సభ్యుల అసెంబ్లీలో ఎన్డీయే 200 మార్కును దాటింది. ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు, తన కుటుంబంతో తెగతెంపులు చేసుకుంటున్నట్టు రోహిణి ఆచార్య ప్రకటించారు. పార్టీ దారుణ వైఫల్యంపై నాయకత్వాన్ని ప్రశ్నించినందుకు తన సోదరుడు తేజస్వి, ఆయన సన్నిహితుడు-ఆర్జేడీ ఎంపీ సంజయ్ యాదవ్ తనను అవమానించారని, దాడికి కూడా ప్రయత్నించారని సంచలన ఆరోపణ చేసారు. ఆత్మగౌరవం విషయంలో తాను రాజీపడేది లేదన్నారు. అవమానభారంతో కుటుంబాన్ని, ఇంటిని విడిచిపెట్టాల్సి వచ్చిందని, తనను అనాథను చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన పరిస్థితి ఏ ఆడకూతురికీ రాకూడదన్నారు.
ఇవి కూడా చదవండి..
అయోధ్యలో భద్రతా వైఫల్యం.. కశ్మీర్ యువకుడి నిర్బంధం..
చరిత్రపై దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలి.. అజిత్ డోభాల్ కీలక వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి