Share News

Ajit Doval: చరిత్రపై దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలి.. అజిత్ డోభాల్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 10 , 2026 | 03:16 PM

భారతదేశంపై గతంలో జరిగిన దాడులను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ప్రస్తావిస్తూ.. లెక్కకుమించి ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, వేలాది ఆలయాలు ధ్వంసమయ్యాయని, గ్రామాలను దోచుకున్నారనీ, మన నాగరికతను అణిచివేశారని అన్నారు.

Ajit Doval: చరిత్రపై దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలి.. అజిత్ డోభాల్ కీలక వ్యాఖ్యలు
Ajit Doval

న్యూఢిల్లీ: దేశ చరిత్రలో గతంలో ఎన్నో దాడులు, అణిచివేతలు జరిగాయని, వాటికి ప్రతీకారం తీర్చుకోవాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ (Ajit Doval) అన్నారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలని, ప్రతీకారం మంచిదే అయినా దానిని ప్రేరణ శక్తిగా మలుచుకోవాలని సూచించారు. ఇందుకోసం దేశ సైనిక, ఆర్థిక పాటవం, సామాజిక భద్రతను బలోపేతం చేసుకోవాలని అన్నారు. మన పూర్వీకులు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారని, ఎన్నో పరీక్షలు, కష్టనష్టాలను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలు, ధీరత్వం పుణికిపుచ్చుకోవాలన్నారు. ఢిల్లీలో శనివారంనాడు జరిగిన 'వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్' కార్యక్రమంలో యువతను ఉద్దేశించి అజిత్ డోభాల్ మాట్లాడారు.


'మీరు అదృష్టవంతులు, ఇండిపెండెంట్ ఇండియాలో మీరు పుట్టారు. భారతదేశం వలసవాదుల గుప్పిట్లో ఉన్నప్పుడు నేను పుట్టాను' అని 81 ఏళ్ల డోభాల్ అన్నారు. దేశవ్యాప్తంగా 3,000 మంది యువ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భగత్‌సింగ్‌ను ఉరి తీశారని, సుభాష్ చంద్రబోస్‌ తన జీవితాంతం కష్టపడ్డారని, స్వాతంత్ర్య సముపార్జన కోసం మహాత్మాగాంధీ సత్యాగ్రహం చేశారని డోభాల్ అన్నారు. ప్రపంచంలో జరిగిన దాడులు, యుద్ధాలకు కొన్ని దేశాలు తమ ఇష్టారీతిగా బలప్రయోగానికి దిగడమే కారణమని అన్నారు. 'మీరు శక్తిమంతులైతేనే స్వేచ్ఛగా మనగలుగుతారు. ఆత్మవిశ్వాసం లేకుండా ఎంత శక్తి ఉన్నా, ఆయుధ సంపత్తి ఉన్నా వృథా. అలాంటి గొప్ప నాయకులు మనకు ఉండటం మనం చేసుకున్న అదృష్టం' అని డోభాల్ అన్నారు.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరును నేరుగా ప్రస్తావించకుండా.. ఆయన పట్టుదల, అంకితభావం, క్రమశిక్షణ మన అందరికీ స్ఫూర్తి అని డోభాల్ అన్నారు. నాయకత్వం గొప్పతనాన్ని వివరిస్తూ నెపోలియన్ అన్న మాటలను ఆయన గుర్తుచేశారు. ఒక గొర్రె నేతృత్వంలోని వెయ్యి సింహాలకు కూడా తాను భయపడనని, కానీ ఒక సింహం నాయకత్వంలోని వెయ్యి గొర్రెలకు భయపడతానని నెపోలియన్ చెప్పేవారని అన్నారు.


మనది ప్రగతిశీల సమాజమని, మనం ఇతరుల నాగరికత, ఆలయాలపై దాడులు చేయమని అన్నారు. భారతదేశంపై గతంలో జరిగిన దాడులను ప్రస్తావిస్తూ, ఈ దాడుల్లో లెక్కకుమించి ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, వేలాది ఆలయాలు ధ్వంసమయ్యాయని, గ్రామాలను దోచుకున్నారనీ, మన నాగరికతను అణిచివేశారని అన్నారు. చరిత్ర మనకు సవాళ్లు విసురుతోందన్నారు. అయితే ఇందుకు తగిన ఫైర్ ఇవాల్టి యువతలో ఉందన్నారు. ప్రతీకారం అనేది మంచి పదం కానప్పటికీ, అది శక్తిమంతమైనదని అన్నారు. దేశం కోసం మనం ప్రతీకారం తీర్చుకోవాలి, అందుకోసం విలువలతో కూడిన సమున్నత భారతదేశాన్ని పునర్నిర్మించుకోవాలని దిశానిర్దేశం చేశారు.


ఇవి కూడా చదవండి..

భారత బాస్మతిపై ఇరాన్‌ ఆంక్షల దెబ్బ!

వణికిస్తున్న వాయు కాలుష్యం!

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 10 , 2026 | 03:45 PM