Share News

Basmati Exports: భారత బాస్మతిపై ఇరాన్‌ ఆంక్షల దెబ్బ!

ABN , Publish Date - Jan 10 , 2026 | 04:54 AM

ఇరాన్‌ కరెన్సీ రియాల్‌ విలువ భారీగా పతనమవడంతోపాటు ఆ దేశంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా విధించిన ఆంక్షల ప్రభావం భారత బాస్మతి ఎగుమతులపై పడింది.

Basmati Exports: భారత బాస్మతిపై ఇరాన్‌ ఆంక్షల దెబ్బ!

  • భారీగా పతనమైన రియాల్‌ మారకం విలువ

  • ఆహార దిగుమతులపై సబ్సిడీ ఎత్తేసిన టెహ్రాన్‌

  • పోర్టుల్లో నిలిచిపోయిన రూ.2 వేల కోట్ల బియ్యం

న్యూఢిల్లీ, జనవరి 9: ఇరాన్‌ కరెన్సీ రియాల్‌ విలువ భారీగా పతనమవడంతోపాటు ఆ దేశంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా విధించిన ఆంక్షల ప్రభావం భారత బాస్మతి ఎగుమతులపై పడింది. దీంతో రూ.2 వేల కోట్ల విలువైన బాస్మతి బియ్యం ఇరాన్‌ పోర్టుల్లోనే నిలిచిపోయింది. రియాల్‌ విలువ పడిపోవడంతో ఇరాన్‌ ప్రభుత్వం ఆహార దిగుమతులపై ఇస్తున్న రాయితీని నిలిపివేసింది. ఈ ప్రభావం భారత్‌ నుంచి ఇరాన్‌కు ఎగుమతి అయిన బాస్మతి బియ్యంపై పడింది. ముఖ్యంగా బాస్మతి బియ్య ఎగుమతి రాష్ట్రాలైన పంజాబ్‌, హరియాణాలకు చెందిన మిల్లర్లు ధరలు పడిపోయి, చేతిలో రూపాయి ఆడక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో ఇరాన్‌లో ఏర్పడిన కరెన్సీ సంక్షోభంతో అక్కడి ప్రభుత్వం రాయితీలను ఎత్తివేసింది. ముఖ్యంగా ఆహారంపై ఇస్తున్న రాయితీలను పూర్తిగా నిలిపివేసింది. దీంతో భారత్‌ నుంచి వెళ్లిన ప్రీమియం బాస్మతి బియ్యం అంతర్జాతీయ ఓడరేవుల్లోనే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌ ప్రభుత్వ సానుకూల నిర్ణయం కోసం మిల్లర్లు ఎదురు చూస్తున్నారు. ‘‘రియాల్‌ పతనంతో ఇరాన్‌ ప్రభుత్వం కొన్నేళ్లుగా అందిస్తున్న ఆహార సబ్సిడీని నిలిపివేసింది. వాణిజ్య పరంగా ఎగుమతి దారులకు ఇది ప్రాణసంకటంగా మారింది.’’ అని పంజాబ్‌ రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు రంజిత్‌ సింగ్‌ జొస్సాన్‌ మీడియాకు తెలిపారు. బాస్మతి బియ్యంతోపాటు టీ, ఔషధాల ఎగుమతులు కూడా సంక్షోభంలో చిక్కుకున్నాయన్నారు. కాగా, భారత్‌ నుంచి బాస్మతి ఎగుమతి అయ్యే ముఖ్య దేశాల్లో ఇరాన్‌ ఒకటి. ఏటా రూ.12 వేల కోట్ల విలువైన 12 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతి అవుతుంది. వీటిలో 40 శాతం పంజాబ్‌, హరియాణాల నుంచే జరుగుతోంది. ప్రస్తుతం బాస్మతి బియ్యం ధరలు కిలోకు రూ.3-4 వరకు తగ్గుముఖం పట్టాయని, ఇది పరోక్షంగా రైతులకు కూడా తీవ్రనష్టాన్ని చేకూరుస్తోందని మిల్లర్లు చెబుతున్నారు. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలకు ముందు డాలరుకు 90వేల రియాల్స్‌ ఉండగా రాను రాను మరింత బలహీన పడి ప్రస్తుతం డాలరుకు 1,50000 రియాల్స్‌ చెల్లించాల్సి వస్తోంది. ఇది ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

Updated Date - Jan 10 , 2026 | 04:54 AM