Air Pollution: వణికిస్తున్న వాయు కాలుష్యం!
ABN , Publish Date - Jan 10 , 2026 | 05:31 AM
వాయు కాలుష్యం భారత్‌ను వణికిస్తోంది. స్వచ్ఛమైన గాలి పీల్చలేని దుస్థితి ఏర్పడింది. ప్రధానంగా పట్టణాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.
దీర్ఘకాలిక కాలుష్యాన్ని ఎదుర్కొంటున్న
దేశంలోని 44 శాతం నగరాలు
సీఆర్‌ఈఏ తాజా అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ, జనవరి 9: వాయు కాలుష్యం భారత్‌ను వణికిస్తోంది. స్వచ్ఛమైన గాలి పీల్చలేని దుస్థితి ఏర్పడింది. ప్రధానంగా పట్టణాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. రాజధాని ఢిల్లీతో పాటు దేశంలోని వందలాది నగరాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. దేశంలోని దాదాపు 44 శాతం నగరాలు దీర్ఘకాలిక వాయు కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇది గాలిలో నిరంతర ఉద్గారాల వలన కలిగే ఒక నిర్మాణాత్మక సమస్యను సూచిస్తుందని సెంటర్ ఫర్ రిసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్‌ఈఏ) తన నివేదికలో పేర్కొంది. వీటిల్లో నాలుగు శాతం నగరాలు మాత్రమే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్‌సీఏపీ) పరిధిలో ఉన్నాయని తెలిపింది. శాటిలైట్ డేటా ఆధారంగా, సీఆర్‌ఈఏ దేశంలోని 4,041 నగరాల్లో పీఎం2.5 స్థాయిలను విశ్లేషించింది. 2014, 2024 మఽధ్య ఒక్క కొవిడ్ ప్రభావిత ఏడాది 2020 మినహా అన్ని సంవత్సరాల్లో 4,041కు గానూ 1,787 నగరాలు జాతీయ వార్షిక పీఎం2.5 ప్రమాణాన్ని మించిపోయాయని నివేదిక పేర్కొంది. 2025 పీఎం2.5 అంచనాల ప్రకారం బన్రీహాట్ (అసోం), ఢిల్లీ, ఘజియాబాద్ (యూపీ) దేశంలోని అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఎన్‌సీఏపీ ప్రస్తుతం 4 శాతం నగరాల్లో మాత్రమే దీర్ఘకాలిక వాయు కాలుష్య సమస్యను పరిష్కరిస్తుండగా.. ఇంకా చాలా వరకు వరకు నగరాలు క్లీన్ ఎయిర్ యాక్షన్ లక్ష్యానికి వెలుపలే ఉన్నాయని నివేదిక పేర్కొది. జాతీయ గాలి నాణ్యతా ప్రమాణాల (ఎన్‌ఏఏక్యూఎస్) లక్ష్యాలను సాధించలేని నగరాలు ఉత్తరప్రదేశ్‌లో అధికంగా 416 ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ (158), గుజరాత్ (152), మధ్యప్రదేశ్ (143), పంజాబ్ (136), బిహార్ (136), పశ్చిమబెంగాల్ (124) ఉన్నాయి.