రివర్స్‌గేర్ వేయలేం... వీబీ-జీ రామ్ జీ చట్టంపై కిరణ్ రిజిజు
ABN , Publish Date - Jan 27 , 2026 | 08:14 PM
ఇప్పటికే వీబీ-జీ రామ్ జీ చట్టం అమల్లోకి వచ్చినందున దానికి రివర్స్ గేర్ వేసి గతంలోకి వెళ్లలేమని కిరణ్ రిజిజు చెప్పారు.
న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన 'వీబీ జీ రామ్ జీ' (VB-G RAM G) చట్టాన్ని వెనక్కి తీసుకోవడం (Roll back) జరగదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) మంగళవారంనాడు స్పష్టం చేశారు. ఇప్పటికే చట్టం అమల్లోకి వచ్చినందున 'రివర్స్ గేర్' వేసి గతంలోకి వెళ్లలేమని చెప్పారు. ఈనెల 28 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో వీబీ జీ రామ్ జీ చట్టంపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రిజిజు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
బడ్జె్ట్ సమావేశాలకు ముందు జరిగే అఖిలపక్ష సమావేశాన్ని రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన మంగళవారంనాడు నిర్వహించారు. సమావేశానంతరం మీడియాతో రిజిజు మాట్లాడుతూ, అఖిలపక్ష సమావేశంలో వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. అయితే బడ్జెట్ సంబంధిత అంశాలపై చర్చలు జరపడమే నియమమని చెప్పారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు విపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తొలుత పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారని, అనంతరం రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుందని రిజిజు చెప్పారు. ఇందులో అన్ని పార్టీలు పాల్గొంటాయని అన్నారు. యూజీసీ కొత్త నిబంధనలతో సహా పలు అంశాలపై చర్చించాలని విపక్షాలు చేస్తున్న డిమాండ్లపై అడిగినప్పుడు, చర్చకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, అయితే రాజ్యాంగపరమైన బాధ్యతలు కూడా ప్రభుత్వానికి ఉంటాయని చెప్పారు. అయితే ఇవి బడ్జెట్ సమావేశాలు కాబట్టి బడ్జెట్‌ను ఉభయసభల్లో ఆమోదించడం, దేశాన్ని నడపడం, ప్రజాసేవ చేయడం తమ ముందున్న బాధ్యతలని అన్నారు. నియమాలు, నిబంధనలను మోదీ ప్రభుత్వం ఎప్పుడూ ఉల్లంఘించదని, రాజ్యాంగం ప్రకారం దేశం నడుస్తుందని, రాజ్యాంగానికి అనుగుణంగానే తాము పనిచేస్తామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నేనూ భారతీయ పౌరుడినే.. ఓసీఐ కార్డును ప్రదర్శించిన ఆంటోనియో కోస్టా
భారత్-ఈయూ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
For More National News And Telugu News