నేనూ భారతీయ పౌరుడినే.. ఓసీఐ కార్డును ప్రదర్శించిన ఆంటోనియా కోస్టా
ABN , Publish Date - Jan 27 , 2026 | 05:11 PM
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ముఖ్యమైన భౌగోళిక రాజకీయ స్థిరీకరణగా ఆంటోనియా కోస్టా అభివర్ణించారు. ఈ ఒప్పందం తనకెంత ప్రత్యేకమైనదో ఆయన వివరిస్తూ ఎవరూ ఊహించని విధంగా తన జేబులోని 'ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డును ప్రదర్శించారు.
న్యూఢిల్లీ: భారత్-ఐరోపా సమాఖ్య (EU) మధ్య దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరింది. న్యూఢిల్లీలో జరిగిన 16వ భారత్-ఈయూ శిఖరాగ్ర సమావేశంలో ఈ ఒప్పందం పూర్తయింది. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియా కోస్టా (Antonia Costa) పర్యవేక్షణలో జరిగిన ఈ ఒప్పందాన్ని 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'గా చర్చించుకుంటున్నారు. ఈ ఒప్పందాన్ని ముఖ్యమైన భౌగోళిక రాజకీయ స్థిరీకరణగా ఆంటోనియా కోస్టా అభివర్ణించారు. ఈ ఒప్పందం తనకెంత ప్రత్యేకమైనదో వివరిస్తూ ఎవరూ ఊహించని విధంగా తన జేబులోని 'ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా’ (OCI) కార్డును ప్రదర్శించారు. భారతీయ మూలాలు కలిగిన వారికి దీర్ఘకాలిక వీసా, గుర్తింపు కార్డును భారత ప్రభుత్వం జారీ చేస్తుంటుంది. గోవా మూలాలున్న యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు కోస్టా కావడం విశేషం.
'నేను యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడిని. అంతేకాదు.. ఓవర్సీస్ ఇండియన్ సిటిజన్‌ను కూడా. దాన్ని బట్టే మీరు ఊహించుకోవచ్చు. ఇది నాకు చాలా ముఖ్యమైన సందర్భం. గోవా మూలాలున్న వ్యక్తిగా నేనెంతో గర్విస్తున్నారు. మా తండ్రిగారి కుటుంబం గోవా నుంచే వచ్చింది. ఆవిధంగా చూసినప్పుడు యూరప్, భారత్ మధ్య సంబంధాలు వ్యక్తిగతంగా కూడా నాకెంతో ప్రత్యేకమైనవి' అని కోస్టా తెలిపారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్‌తో కలిసి ఈయూ ప్రతినిధి బృందానికి ఆయన నేతృత్వం వహించారు.
భారత్-ఈయూ మధ్య ఇవాల్టితో వాణిజ్య సంప్రదింపులు ముగిశాయని, రెండు దేశాల మధ్య జరిగిన శిఖరాగ్ర సమావేశం ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చిందని కోస్టా అన్నారు. ప్రపంచం వేగంగా మార్పులు చెందుతున్న తరుణంలో యూరోపియన్ యూనియన్, భారత్ కలిసికట్టుగా వ్యూహాత్మక, విశ్వసనీయ భాగస్వాములుగా నిలుస్తున్నాయని, తమ మధ్యనున్న భాగస్వామ్యాన్ని సరికొత్త స్థాయికి ఈరోజు తీసుకువెళ్తామని చెప్పారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా పౌరుల ప్రయోజనాలకు కలిసికట్టుగా పనిచేయనున్నామని చెప్పారు. ప్రపంచ శాంతి, సుస్థిరత, ఆర్థిక వృద్ధి, సమ్మిళిత అభివృద్ధికి ఈ ఒప్పందం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.
ఒకప్పటి పోర్చుగీస్ కాలనీగా ఉండే గోవాలో కోస్టా కుటుంబ మూలాలు ఉన్నాయి. ఆయన తాతగారు గోవాలోనే పుట్టి ఎక్కువ కాలం అక్కడే జీవించారు. కోస్టా సైతం గతంలో పోర్చుగీస్ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన తండ్రి ఓర్లాండో డా కోస్టా ప్రముఖ రచయిత కూడా. ఆయన రచనల్లో గోవా ప్రభావం ఎక్కువగా కనిపించేది. ఆంటోనియో కోస్టా పోర్చుగీసు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2017లో ఆయనకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'ఓసీఐ' కార్డును అందజేశారు. ప్రపంచంలోని భారత సంతతి ప్రముఖుల్లో కోస్టా ఒకరని ఆ సందర్భంగా కోస్టాను మోదీ అభినందించారు. 2017లో భారత్‌లో కోస్టా పర్యటించినప్పుడు 'ప్రవాసి భారతీయ సమ్మాన్' అవార్డును కూడా అందుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత్-ఈయూ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
జన నాయగన్ చిత్రంపై హైకోర్టు కీలక నిర్ణయం
For More National News And Telugu News