చారిత్రక ఘట్టం.. భారత్-ఈయూ ఒప్పందంలో కీలక అంశాలివే..
ABN , Publish Date - Jan 27 , 2026 | 04:42 PM
ఢిల్లీ వేదికగా ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. భారత్ - యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఈ ఒప్పందాన్ని యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'గా అభివర్ణించారు.
ఢిల్లీ, జనవరి 27: దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. భారత్ - ఐరోపా సమాఖ్య(ఈయూ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(FTA) ఖరారైంది. ఈ ఒప్పందాన్ని యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్(Mother Of All Deals)'గా అభివర్ణించారు. ఈ మేరకు మంగళవారం.. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా, కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టాలతో జరిగిన 16వ శిఖరాగ్ర సమావేశంలో ఈ ఒప్పందాన్ని అధికారికంగా ఖరారు చేశారు. భారత్ - ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలను తొలిసారి 2007లో ప్రారంభించాయి.18 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఈ ఒప్పందం ఖరారైంది. ఎఫ్‌టీఏ ఒప్పందంలో ఖరారైన కీలక అంశాలేంటో తెలుసుకుందాం..
ఈయూతో జరిగిన తాజా ఒప్పందం ద్వారా భారత్ నుంచి జరిగే 97 శాతం ఎగుమతులపై సుంకాలు రద్దు కానున్నాయి. ముఖ్యంగా టెక్స్‌టైల్స్, డైమండ్స్, లెదర్ వంటి రంగాలకు ప్రోత్సాహం కానుంది. ఇదే సమయంలో యూరప్ కార్లు, యంత్ర పరికరాలు భారత మార్కెట్లోకి ప్రవేశం సులభతరం అవుతుంది. వాణిజ్యంతో పాటు రక్షణ, భద్రత, వాతావరణ మార్పులు, కీలక సాంకేతికతలు వంటి అంశాలపైనా ఇరుపక్షాలు దృష్టి సారించాయి. యూరప్.. అమెరికా, చైనాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి, ఇతర ప్రాంతాలతో తన దౌత్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో భారత్‌తో ఈ కొత్త భాగస్వామ్యం ఏర్పడింది. రక్షణ రంగం విషయంలో భారత్, ఈయూ 2004 నుంచి వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నాయి.
తాజాగా.. కుదిరిన రక్షణ భాగస్వామ్యం(SDP) ఒప్పందం ఇరుపక్షాల మధ్య రక్షణ, భద్రతా సహకారాన్ని మరింత దగ్గర చేసింది. ఈ ఒప్పందంతో ఈయూ నిర్వహించే సెక్యూరిటీ యాక్షన్ ఫర్ యూరప్ కార్యక్రమంలో పాల్గొనడానికి భారతీయ సంస్థలకు మార్గం సుగమమైంది. ఇరుదేశాల స్వేచ్ఛా వాణిజ్యం విషయానికి వస్తే.. ఈ ఒప్పందం కోసం 2007లో చర్చలను ప్రారంభించాయి. అయితే ఇరుపక్షాల లక్ష్యాల్లో వ్యత్యాసం కారణంగా 2013లో చర్చలు ఆగిపోయాయి. 2022 జూన్‌లో తిరిగి ప్రారంభమయ్యాయి. స్వేచ్ఛా వాణిజ్యంలో జరిగిన ఒప్పందంతో ఐరోపాకు భారతీయ కార్మికుల రాకపోకలు సులభతరం కానున్నాయి. ఈయూ వస్తువుల వాణిజ్యంలో భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈయూతో భారత్ వస్తువుల వాణిజ్యం సుమారు 136 బిలియన్ డాలర్లుగా ఉందని పలు ఏజెన్సీలు తమ నివేదికల్లో పేర్కొన్నాయి.
మొత్తంగా ఢిల్లీలో జరిగిన 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్' ఒప్పందం వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన 77వ భారత గణతంత్ర ఉత్సవాలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వీరితో ప్రధాని మోదీ చర్చలు జరిపి విజయవంతమయ్యారు. ఈయూ కౌన్సిల్ ప్రెసిడెంట్ కోస్టా మాట్లాడుతూ.. ‘ఐరోపా, భారత్ బంధం ఈనాటిది కాదు. ఈ ఒప్పందం చరిత్రాత్మక ముందడుగు. ఇది కుదిరేందుకు ప్రధాని మోదీ ఎంతో చొరవ తీసుకున్నారు’ అని కొనియాడారు.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అకీరా నందన్
రైల్వే శాఖతో పోరాడి విజయం సాధించిన విద్యార్థిని