కాంగ్రెస్ ఈవెంట్‌లో డీకే నినాదాలు.. సహనం కోల్పోయిన సీఎం
ABN , Publish Date - Jan 27 , 2026 | 06:06 PM
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానే కేంద్రం తీసుకువచ్చిన 'వీబీ జీ రామ్ జీ' చట్టాన్ని రద్దు చేయాలంటూ కాంగ్రెస్ మంగళవారంనాడు నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో సిద్ధరామయ్య పాల్గొన్నారు.
బెంగళూరు: కర్ణాటక (Karnataka) కాంగ్రెస్‌లో తలెత్తిన నాయకత్వ పోరు కొనసాగుతోంది. బెంగళూరులో మంగళవారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) సహనం కోల్పోయారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు అనుకూలంగా కొందరు కార్యకర్తలు 'డీకే..డీకే' అంటూ నినాదాలు చేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానే కేంద్రం తీసుకువచ్చిన 'వీబీ జీ రామ్ జీ' చట్టాన్ని రద్దు చేయాలంటూ కాంగ్రెస్ మంగళవారంనాడు నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడేందుకు సిద్ధమవుతుండగా కొందరు కార్యకర్తలు 'డీకే..డీకే'అంటూ నినాదాలు చేశారు. దీంతో ముఖ్యమంత్రి అసహనానికి గురయ్యారు. కార్యకర్తలను కూర్చోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నిర్వాహకులు అప్రమత్తమై యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.
సిద్ధరామయ్య ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 20న రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. దీంతో తక్కిన రెండున్నరేళ్లు డీకే శివకుమార్‌కు సీఎం పగ్గాలు అప్పగించాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు చెరో రెండున్నరేళ్ల సీఎం పదవిని పంచుకునేందుకు ఒప్పందం కుదిరందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కాంగ్రెస్ ఎలాంటి స్పష్టత ఇవ్వనప్పటికీ రాహుల్ గాంధీతో సమావేశానికి ఇద్దరు నేతలు సమయం ఇవ్వాలని కొద్దికాలంగా కోరుతున్నారు. ఈనెల మొదట్లో రాహుల్ కొద్దిసేపు మైసూరు వచ్చినప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం ఆయనను కలుసుకున్నారు. కాగా, నాయకత్వంపై నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ అధిష్ఠానమేనని సిద్ధరామయ్య రెండ్రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. 2028లో తిరిగి కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నేనూ భారతీయ పౌరుడినే.. ఓసీఐ కార్డును ప్రదర్శించిన ఆంటోనియో కోస్టా
భారత్-ఈయూ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
For More National News And Telugu News