మహిళలకు హక్కులు కల్పించేందుకు కృషి చేస్తూనే ఉంటాం: రిజిజు
ABN , Publish Date - Apr 18 , 2026 | 03:24 PM
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటున్న తీరు సిగ్గుచేటని విమర్శించారాయన.
ఇంటర్నెట్ డెస్క్: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంతో.. 2014 తర్వాత మోదీ ప్రభుత్వానికి తొలి వైఫల్యం ఎదురైంది. దీనిపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ.. విపక్షాలు ఈ బిల్లును అడ్డుకుని మహిళల పట్ల వ్యతిరేకతను చాటుకున్నాయని మండిపడ్డారు. ఇందుకు విపక్ష పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా శిక్ష అనుభయిస్తాయన్నారు. లోక్‌సభలో బిల్లు విఫలమవడం పట్ల ప్రభుత్వం తీవ్ర నిరాశ చెందిందని, అయితే.. ఇందులో కేంద్ర, బీజేపీ వైఫల్యమేమీ లేదని స్పష్టం చేశారు. ఇది అందరికీ ఓ చీకటి రోజు అని, కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటున్న తీరు సిగ్గుచేటని, ఖండించదగినదని రిజిజు అన్నారు.
మహిళా సాధికారతకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ.. పార్లమెంట్ సమావేశాలు అత్యంత విజయవంతమయ్యాయని రిజిజు చెప్పుకొచ్చారు. 'మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికం అని రాహుల్ గాంధీ అంటే.. మహిళలకు హక్కులు ఇవ్వడం ఎలా అప్రజాస్వామికం అవుతుందో ఆయనకే తెలియాలి. ఆయన ఆలోచనా విధానం ఎలాంటిదో నేను చెప్పలేను' అని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై ప్రతిపక్షాల ఆరోపణలను రిజిజు తిప్పికొట్టారు. లోక్‌సభలో ఏ రాష్ట్రం కూడా తన ప్రాతినిధ్యాన్ని కోల్పోదని హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తుచేశారు. దేశంలో జనాభా పెరిగినందున.. అందుకు తగినట్టుగా సవరణ అనివార్యమైందని పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ల బిల్లుకు నియోజకవర్గాల పునర్విభజనను ఎందుకు ముడిపెట్టారో కాంగ్రెస్‌కు అర్థమైందని, అయినప్పటికీ దానిని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. కేవలం రాహుల్ కారణంగానే తామీ బిల్లును వ్యతిరేకించక తప్పడం లేదని చాలా మంది కాంగ్రెస్ నేతలు తనతో చెప్పారని రిజిజు పేర్కొన్నారు. దిగువ సభలో మహిళలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఉండటాన్ని కాంగ్రెస్ సహించడం లేదన్నారు. 'అమిత్ షా ఈ విషయంపై లిఖితపూర్వక వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. బిల్లును ఓడించిన తర్వాత కాంగ్రెస్ పన్నబోయే ఉచ్చులో మనం పడొద్దు' అని కిరణ్ రిజిజు మీడియా వేదికగా అన్నారు. కాంగ్రెస్ హయాం నాటి బిల్లులో పుల్‌స్టాప్, కామా కూడా మార్చలేదన్న రిజిజు.. మహిళల హక్కుల కోసం తాము కృషి చేస్తూనే ఉంటామని తెలిపారు.
ఇవీ చదవండి:
మహిళా బిల్లును వ్యతిరేకించి విపక్షాలు తప్పు చేశాయి: మోదీ
విపక్షాలు ఐక్యంగా ఉండి బీజేపీ కుట్రలను అడ్డుకున్నాయి: ప్రియాంక