Share News

అజిత్ ఢోబాల్, జైశంకర్‌​​‌తో ఉక్రెయిన్ ఉన్నతాధికారి భేటీ

ABN , Publish Date - Apr 18 , 2026 | 11:31 AM

ఉక్రెయిన్ రక్షణ శాఖ కార్యదర్శి, జెలెన్‌స్కీ సన్నిహితుడు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ భద్రతా సలహాదారు, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రులతో ప్రత్యేక భేటీ నిర్వహించారు.

అజిత్ ఢోబాల్, జైశంకర్‌​​‌తో ఉక్రెయిన్ ఉన్నతాధికారి భేటీ
Rustem Umerov meets Ajith Doval at Delhi

ఇంటర్నెట్ డెస్క్: భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్, విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్‌లతో ఉక్రెయిన్ రక్షణ శాఖ కార్యదర్శి రుస్తెం ఉమెరోవ్ భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఉక్రెయిన్, రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధానికి శాంతియుత పరిష్కారం కనుగొనే ప్రయత్నాలపై చర్చించినట్టు తెలుస్తోంది. సంప్రదింపులు, దౌత్యం ద్వారా శాంతిమార్గంలో సమస్యలను పరిష్కరించుకోవాలని భారత్ తన వైఖరిని పునరుద్ఘాటింది. సంఘర్షణలతో అట్టుడికిపోతున్న ఉక్రెయిన్‌లో శాశ్వత శాంతిని నెలకొల్పాల్సిన అవసరాన్ని భారత్ ప్రస్తావించింది. ఈ భేటీతో అంతర్జాతీయంగా విభేదాలను తగ్గించగల ప్రపంచ దౌత్యశక్తిగా ఢిల్లీ ఎదుగుతోందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఉక్రెయిన్ ఉన్నతాధికారి, జెలెన్‌స్కీ సన్నిహితుడైన ఉమెరోవ్‌.. అజిత్ ఢోబాల్, ఎస్.జైశంకర్‌లతో వేర్వేరు సమావేశాలు నిర్వహించారు. రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లోని ప్రస్తుత పరిస్థితులు, చర్చల పురోగతి, యుద్ధాన్ని ఆపి శాశ్వత శాంతిని నెలకొల్పే మార్గాలపై ప్రధానంగా చర్చలు జరిగినట్టు సమాచారం. అయితే.. ఇరుదేశాల మధ్య వివాదాన్ని చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలని, యుద్ధం ఏ సమస్యకూ పరిష్కారం కాదని మరోసారి భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది. 2024 ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటన అనంతరం ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల అమలు, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై కూడా చర్చలు జరిగాయి. ఈ భేటీకి ముందు రష్యా-ఉక్రెయిన్ శాంతి ప్రయత్నాల్లో భాగంగా అజిత్ ఢోబాల్ రష్యాలో పర్యటించి పలు కీలక సమావేశాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.


ఇవీ చదవండి:

30 సంవత్సరాలుగా అవరోధాలే!

దక్షిణాది దెబ్బ!

Updated Date - Apr 18 , 2026 | 12:54 PM