Share News

దక్షిణాది దెబ్బ!

ABN , Publish Date - Apr 18 , 2026 | 07:12 AM

ప్రగతిశీల ప్రయాణంలోనే కాదు.. పదునైన రాజకీయ పోరాటంలోనూ తాము ముందే ఉంటామని దక్షిణాది రాష్ట్రాలు మరోసారి నిరూపించాయి. కేంద్ర ప్రభుత్వం హడావిడిగా తెచ్చిన నియోజకవర్గాల...

దక్షిణాది దెబ్బ!

డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా గట్టిగా పోరాడిన దక్షిణాది రాష్ట్రాలు

  • కేంద్ర విధానంపై బలంగా పోరాటం చేసిన తెలంగాణ సీఎం రేవంత్‌

  • అన్యాయంపై తమిళనాడు, కేరళం, కర్ణాటక నేతల ఆగ్రహావేశాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 17: ప్రగతిశీల ప్రయాణంలోనే కాదు.. పదునైన రాజకీయ పోరాటంలోనూ తాము ముందే ఉంటామని దక్షిణాది రాష్ట్రాలు మరోసారి నిరూపించాయి. కేంద్ర ప్రభుత్వం హడావిడిగా తెచ్చిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసి.. మోదీ సర్కారుకు ఓటమి రుచి చూపించాయి. మహిళా రిజర్వేషన్‌ బిల్లును ముందుపెట్టి.. డీలిమిటేషన్‌ బిల్లును ఆమోదింపజేసుకోవాలన్న కేంద్ర ఎత్తుగడ ను లోక్‌సభలో శుక్రవారం మూకుమ్మడిగా తిప్పికొట్టాయి. మహిళా రిజర్వేషన్‌ చట్ట సవరణ బిల్లు సభలో వీగిపోయేలా చేయటంలో దక్షిణాది రాష్ట్రాల ఎంపీలే కీలకపాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీలు మినహా తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని ఎన్డీయే యేతర పార్టీల ఎంపీలంతా ఈ బిల్లును మరో ఆలోచనకు తావులేకుండా తిరస్కరించారు. తమిళనాడుకు చెందిన 38మంది, కేరళలోని 20 మంది, తెలంగాణలోని 9మంది, కర్ణాటకలోని 9 మంది ఎన్డీయే యేతర ఎంపీలు డీలిమిటేషన్‌ బిల్లును అడ్డుకోవటంలో కీలకపాత్ర పోషించారు.

తమిళ తంబీల తాండవం

రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవటంలోనూ.. ఆత్మాభిమాన పోరాటంలోనూ ముందుండే తమిళనాడు నేతలు.. డీలిమిటేషన్‌పైనా అదే స్థాయిలో పోరాటం చేశారు. మొండిగా ముందుకెళ్తే హిందీ భాష అమలుకు వ్యతిరేకంగా 1960ల్లో జరిగిన హింసాకత్మక పోరాటం లాంటి ఉద్యమాన్ని మళ్లీ చూస్తారని కేంద్రాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్‌ హెచ్చరించటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. డీలిమిటేషన్‌ బిల్లును బహిరంగా తగులబెట్టి తమ నిరసన ఏ స్థాయిలో ఉంటుందో చూడాలని కేంద్రాన్ని సవాల్‌ చేశారు. పార్లమెంటులోనూ తమిళనాడు ఎంపీలు నల్ల దుస్తులు ధరించి బిల్లుకు వ్యతిరేకంగా బలంగా పోరాటం చేశారు.

సిద్దు చిందులు.. పినరాయి పంచ్‌లు

డీలిమిటేషన్‌ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ సీఎం పినరాయి విజయన్‌ కూడా తమ గళాలను గట్టిగానే వినిపించారు. కొత్తగా జనాభా లెక్కలను సేకరించకుండానే మోదీ సర్కారు ఏకపక్షంగా, హడావిడిగా డీలిమిటేషన్‌కు పూనుకోవటంపై అనుమానాలు లేవనె త్తారు. కేంద్రం దక్షిణాదికి ద్రోహం చేసి, భవిష్యత్తులో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో ఈ రాష్ట్రాల ప్రాతినిధ్యంతో పనిలేకుండా చేయటమే మోదీ సర్కారు అసలు లక్ష్యమని విమర్శలు గుప్పించారు. రాజ్యాంగాన్ని బలహీనపర్చి, దేశ ఎన్నికల ముఖచిత్రాన్నే మార్చేయాలని కేంద్రం కుట్ర చేస్తోందని కమ్యూనిస్టు పార్టీలు బలంగా వాదించి పోరాటం చేశాయి. లోక్‌సభలో ఓటింగ్‌ సమయంలో ఈ రాష్ట్రాల ప్రతిపక్ష ఎంపీలంతా సమన్వయంతో పనిచేసి బిల్లును ఓడించారు.


పోరాటాన్ని రగిలించిన రేవంత్‌..

డీలిమిటేషన్‌ కోసం కేంద్రం రూపొందించిన ఫార్ములాను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మొదటి నుంచీ గట్టిగా వ్యతిరేకించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్రం బిల్లులో ప్రతిపాదించగా, సీఎం రేవంత్‌ అందుకు రెండు ప్రత్యామ్నాయాలను సూచించి దేశం దృష్టిని ఆకర్షించారు. రాష్ట్రాలు సాధించిన ఆర్థిక, సామాజిక ప్రగతి ఆధారంగా సీట్లు పెంచాలన్న రేవంత్‌ డిమాండ్‌ పార్లమెంటులోనూ చర్చకు వచ్చేలా చేశారు. ప్రకటనలతో సరిపెట్టకుండా తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంటులో ఈ బిల్లులకు వ్యతిరేకంగా బలంగా పోరాటం చేసేలా ప్రోత్సహించారు. మీడియా సమావేశాలు నిర్వహించి ఆ బిల్లుల వెనుక కేంద్ర ప్రభుత్వ అసలు ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి ఎండగట్టారు.

ఢిల్లీని ఓడించాం: స్టాలిన్‌

‘ఢిల్లీని తమిళనాడు ఓడించింది’ అని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ప్రకటించారు. శుక్రవారం పార్లమెంటులో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిన అనంతరం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఢిల్లీని తమిళనాడు ఓడించింది. ఢిల్లీ అహంకారాన్ని, ఆ అహంకారానికి మద్దతు ఇచ్చే బానిసల్ని ఏప్రిల్‌ 23న ఓడిస్తాం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రకటనతో పాటు గురువారం డీలిమిటేషన్‌ బిల్లు కాపీని తగలబెడుతున్న తన ఫొటోను కూడా జత చేశారు. శుక్రవారం తేని, ఆండిపట్టిలో జరిగిన బహిరంగ సభల్లో సీఎం స్టాలిన్‌ మాట్లాడారు. ‘‘లోక్‌సభలో బిల్లు వీగిపోవడం కేవలం ట్రైలర్‌ మాత్రమే. అసలు సినిమా ముందుంది. డీలిమిటేషన్‌ బిల్లును వ్యతిరేకిస్తూ డీఎంకే శ్రేణులు రాష్ట్రంలో నల్ల జెండాలతో నిరసన తెలిపాయి. ఆ నిరసనలపై లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా వ్యాఖ్యానిస్తూ తమిళుల ఆత్మగౌరవాన్ని కించపరిచారు. ఆయన వ్యాఖ్యలు గర్హనీయం. తమిళనాట కాషాయ జెండాకు తావులేదు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కంటే డీలిమిటేషన్‌ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే ముప్పే నన్ను ఆందోళనకు గురి చేసింది. అందుకే ఆ బిల్లును అడ్డుకునేందుకు డీఎంకే ఎంపీలందరినీ ఢిల్లీకి పంపాను. ఆ బిల్లు పార్లమెంట్‌లో వీగిపోవటం హర్షణీయం. డీఎంకే ఎంపీలు పార్లమెంట్‌లో పటిష్ఠమైన వాదనల్ని వినిపించారు’’ అని స్టాలిన్‌ ప్రశంసించారు. శుక్రవారం జరిగిన ప్రచార సభలకు కూడా ఆయన నల్ల దుస్తులను ధరించే హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి

ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనల్లో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

పూర్తిగా తెరుచుకున్న హోర్ముజ్.. దిగ్బంధనం విషయంలో ట్రంప్ ట్విస్ట్..

Updated Date - Apr 18 , 2026 | 07:49 AM